విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఎయిర్‌ సువిధ ఎత్తివేత

21 Nov, 2022 23:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా మహమ్మారి కట్టడి కోసం తీసుకొచ్చిన ‘ఎయిర్‌ సువిధ’ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధనను ఎత్తివేసింది.  అయితే, ‘ఎయిర్‌ సువిధ’ నిబంధనను ఎత్తివేసినప్పటికీ కొన్ని అంశాలను ప్రయాణికులు కచ్చితంగా పాటించాలని కోరింది. ప్రయాణ సమయంలో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వాళ్లు మాస్కు ధరించాలని, మిగతా ప్రయాణికులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇలాంటి వారు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌లో ఉండాలని తెలిపింది. 

కోవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. వారి వ్యక్తిగత వివరాలతో పాటు ఏ వ్యాక్సిన్‌, ఎన్ని డోసులు, ఏ సమయంలో తిసుకున్నారనే వివరాలను అందించాల్సి ఉంటుంది. ఆర్టీపీసీఆర్‌ టెస్టు వివరాలనూ ‘ఎయిర్‌ సువిధ’ పోర్టల్‌లోని సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రంలో పొందుపరచాల్సి ఉండగా.. తాజాగా ఆ నిబంధనను భారత్‌ ఎత్తివేసింది. ఈ నిబంధన ఎత్తివేసినప్పటికీ పూర్తిస్థాయిలో కోవిడ్‌ టీకా తీసుకున్న తర్వాతే భారత్‌కు రావడం మంచిదని పేర్కొంది. డీ బోర్డింగ్‌ సమయంలోనూ థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు ఉంటాయని, కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్‌కు వెళ్లాలని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ.

ఇదీ చదవండి: Viral Video: ఘోస్ట్‌ పేషెంట్‌తో మాట్లాడుతున్న సెక్యూరిటీ గార్డు

మరిన్ని వార్తలు