కరోనా టీకా వల్ల మరణిస్తే పరిహారం ఇవ్వలేం: కేంద్రం

30 Nov, 2022 05:59 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 టీకా తీసుకున్నాక దుష్ప్రభావాల వల్ల మరణిస్తే బాధ్యత వహించబోమని కేంద్రం పేర్కొంది. బాధిత కుటుంబానికి పరిహారమివ్వలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ వల్ల మరణించినట్లు అనుమానిస్తున్న ఇద్దరు యువతుల తల్లిదండ్రులు ప్రభుత్వం నుంచి పరిహారం కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం తాజాగా అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రస్తుతం ప్రజలకు అందజేస్తున్న కరోనా టీకాలను థర్డ్‌ పార్టీలు (ప్రైవేట్‌ కంపెనీలు) తయారు చేస్తున్నాయని, అన్ని రకాల పరీక్ష తర్వాత నియంత్రణ సంస్థల ఆమోదంతోనే అవి మార్కెట్‌లోకి వస్తున్నాయని అఫిడవిట్‌లో పేర్కొంది. కరోనా టీకాలు సురక్షితమేనని, ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు గుర్తించాయని వెల్లడించింది.

మరిన్ని వార్తలు