పెరిగిన పాక్‌ డ్రోన్ల ముప్పు

2 Jan, 2023 06:04 IST|Sakshi

చండీగఢ్‌: పాకిస్తాన్‌ నుంచి డ్రోన్లు సరిహద్దును దాటి భారత్‌లోని పంజాబ్‌లోకి ప్రవేశిస్తున్నాయి. ఇలా వచ్చిన డ్రోన్ల సంఖ్య కేవలం ఏడాదిలోనే నాలుగు రెట్లు పెరగడం గమనార్హం. 2021లో 67 డ్రోన్లు, 2022లో 254 డ్రోన్లు పాక్‌ భూభాగం నుంచి పంజాబ్‌లోకి వచ్చినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022లో 254 డ్రోన్లు రాగా, వీటిలో 9 డ్రోన్లను బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కూల్చివేశారు. 13 డ్రోన్లు వివిధ కారణాలతో నేలకూలాయి.

పాక్‌ ముష్కరులు మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రితో కూడిన డ్రోన్లను భారత్‌లోకి చేరవేస్తున్నట్లు సైనికాధికారులు చెబుతున్నారు. 2022లో గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో ఉన్న తూర్పు సరిహద్దులో 311 డ్రోన్లను గుర్తించారు. 2020లో 77, 2021లో 104 డ్రోన్లు పట్టుబడ్డాయి. సరిహద్దుల్లో జామింగ్‌ టెక్నాలజీ లేదా రైఫిల్‌ ఫైరింగ్‌ ద్వారా డ్రోన్లను కూల్చివేస్తున్నట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారి ఒకరు వెల్లడించారు. కూల్చివేతలో పాల్గొన్న బృందానికి రూ.లక్ష నగదు బహుమతి అందజేస్తున్నామని          తెలిపారు.

మరిన్ని వార్తలు