వీడియో: బైక్‌ను ఢీకొట్టిను లగ్జరీ కారు.. మూడు కి.మీలు రోడ్డుపై ఈడ్చుకెళ్లి..  

3 Feb, 2023 10:25 IST|Sakshi

గురుగ్రామ్‌: ఓ కారు డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ రోడ్డు పక్కనే పార్క్‌ చేసి ఉన్న బైక్‌ను ఢీకొట్టాడు. అనంతరం, కారు బ్యానెట్‌కు బైక్‌ లాక్‌ అవడంతో కారు డ్రైవర్‌ బైక్‌ను అలాగే ఈడ్చుకుంటూ దాదాపు మూడు కిలోమీటర్లు వెళ్లాడు. అనంతరం, కారును వదిలేసి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో బైకర్‌ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కాగా, ఈ షాకింగ్‌ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. బౌన్సర్‌ మోను తన విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో రాత్రి 11.30 గంటల ప్రాంతంలో రోడ్డుపై పార్క్‌ చేసిన తన బైకును తీస్తుండగా హోండా సిటీ కారు ఒకటి హైస్పీడ్‌తో దూసుకొచ్చింది. పార్క్‌ చేసి ఉన్న బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోను తృటిలో తప్పించుకున్నాడు. క్షణాల వ్యవధిలో కారు.. బైక్‌ను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది. ఇంతలో మోను కారు ఆపాలంటూ అరిచిన కారు డ్రైవర్‌ మాత్రం ర్యాష్‌ డ్రైవింగ్‌తో బైకును మూడు కిలోమీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో రోడ్డు వెళ్తున్న వాహనదారులు కారును ఆపాలని ఎంత ప్రయత్నించిన అవేవీ పట్టించుకోకుండా డ్రైవర్‌ స్పీడ్‌గా డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లిపోయాడు. తర్వాత.. కారు రోడ్డుపైనే వదిలేసి పరారయ్యాడు.

అనంతరం, మోను వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు నంబర్‌ ఆధారంగా నిందితుడిని ఫరీదాబాద్‌కు చెందిన సుశాంత్‌ మెహతాగా గుర్తించారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు గురుగ్రామ్‌ పోలీసులు సుభాష్ బోకెన్ తెలిపారు.

మరిన్ని వార్తలు