వివాదాస్పద వీడియో.. మధు పూర్ణిమపై కేసు

10 Nov, 2020 17:46 IST|Sakshi

సోషల్‌ మీడియాలో అవాస్తవల ప్రచారంపై కఠినంగా వ్యవహరిస్తాం: పోలీసులు

కోల్‌కతా : సామాజిక మాధ్యమంలో వివాదాస్పద వీడియోను పోస్ట్‌ చేసినందుకు సామాజిక కార్యకర‍్త మధు పూర్ణిమా కిష్వార్‌పై కేసు నమోదైంది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఓ మత ర్యాలీని కోల్‌కతాలో జరిగినట్టు ఆమె తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దీనికి సంబంధించి ఆమెపై కోల్‌కత్తా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మధు పూర్ణిమా పోస్ట్‌ చేసిన వీడియోలో ఉండే గీతం‌ బంగ్లాదేశ్‌కు చెందిందని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. ఆమె పోస్ట్‌ చేసిన వీడియోలో బంగ్లాదేశ్‌ జాతీయ పతాకం స్పష్టం కనిపిస్తోందన్నారు. ఎక్కడో జరిగిన సంఘటనను కోల్‌కతాలో జరిగిందని చూపి శాంతి, భద్రతలకు విఘాతం కలిగించేదిలా ఉందని అందుకే ఆమెపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఇలాంటి చర్యలను ఊపేక్షించమని, మత వ్యవహారాలను కించే పరిచే విధంగా పోస్టులు చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు.

పుకార్లను నమ్మద్దు: సోషల్‌ మీడియాలో పోలీసులు
బంగ్లాదేశ్‌లో జరిగిన ఓ సంఘటనను కోల్‌కతాలో జరిగిందని తెలుపుతూ వచ్చిన వీడియోలో ఎటువంటి వాస్తవం లేదని, దీనిని పోస్ట్‌ చేసిన వారిపై చట్టపరమైనా చర్యలు చేపడతామని పోలీసులు సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. వీడియోను పోస్ట్‌ చేసిన కిష్వార్‌ ట్విట్టర్‌ ఖాతాలో సుమారు 20 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. నిజం తెలుసుకున్న తరువాత కిష్వార్‌ పోస్ట్‌ చేసిన వివాదస్పద వీడియోను తొలగించి,  ఈ వీడియో తనకు దగ్గరి వ్యక్తుల నుంచి వచ్చిందని అందుకే పోస్ట్‌ చేసినట్టు చెప్పారు.  అనంతరం తాను చేసిన తప్పుకు క్షమాపణ కోరుతున్నట్టు ఆమె ట్విట్టర్‌లో తెలిపారు.

మరిన్ని వార్తలు