ఆస్పత్రిలో నవనీత్‌ రాణా ఫొటో వైరల్‌పై కేసు నమోదు..ఫోటో తీసిందెవరు?

13 May, 2022 12:49 IST|Sakshi

సాక్షి, ముంబై: లీలావతి ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ చేస్తుండగా అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా ఫొటో తీసిన గుర్తు తెలియని వ్యక్తిపై స్థానిక బాంద్రా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్‌లో ఓ వ్యక్తి తన మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఫొటో తీసినట్లు కనిపిస్తోంది. కాని ముఖం స్పష్టంగా కనిపించకపోవడంతో ఆ వ్యక్తి ఎవరై ఉంటారనేది తెలుసుకోవడం కష్టతరంగా మారింది. దీంతో ఆ వ్యక్తి రాణాకు పరిచయం ఉన్నవారా.. లేక ఆస్పత్రి సిబ్బందా.. లేక బయట వ్యక్తులెవరైనా తీశారా..? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

బాంద్రాలోని కళానగర్‌లో ఉన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నివాసమైన మాతోశ్రీ బంగ్లా ఎదుట హనుమాన్‌ చాలీసా పఠనం చేయడానికి గత పక్షం రోజుల కిందట వచ్చిన ఎంపీ నవనీత్‌ రాణా, ఎమ్మెల్యే రవీ రాణాలపై రాజద్రోహం కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. దాదాపు పక్షం రోజులు జైలులో ఉన్న దంపతులు ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు.

ఆమె నడుము, మెడ నొప్పితో బాధపడుతుండటంతో బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ల సలహా మేరకు ఈ నెల ఆరో తేదీన రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆమెకు ఎంఆర్‌ఐ చేయించేందుకు క్యాబిన్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ తెల్ల చొక్కా ధరించిన రాణా అంగరక్షకుడు, మరో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఎలాంటి అనుమతి తీసుకోకుండా తన మొబైల్‌ ద్వారా నవనీత్‌ రాణాను ట్రాలీపై పడుకోబెట్టి ఎంఆర్‌ఐ పరీక్ష చేస్తుండగా ఫొటో తీశాడు. ఆ ఫోటోను మీడియాకు ఇవ్వడమేగాకుండా సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశాడు.

నియమాల ప్రకారం ఎంఆర్‌ఐ క్యాబిన్‌లోకి ఇతరులెవరు వెళ్లకూడదు, ఫొటోలు తీయకూడదు. ముఖ్యంగా అయస్కాంత గుణం కారణంగా ఎలక్ట్రానిక్‌ వస్తువులు, లోహపు వస్తువులు అక్కడికి తీసుకెళ్లకూడదు. ఎంఆర్‌ఐ క్యాబిన్‌ బయట బోర్డు కూడా రాసి ఉంది. అయినప్పటికీ ఫొటో తీయడమేగాకుండా వైరల్‌ చేయడంపై శివసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాంద్రా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయగానే లీలావతి ఆస్పత్రి యాజమాన్యం కూడా పోలీసు స్టేషన్‌కు పరుగులు తీసి ఫిర్యాదు చేసింది. ఆస్పత్రి భద్రతా విభాగం సూపర్‌వైజర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫొటో తీసిన ఆ గుర్తు తెలియని వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు