ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌.. ​కేసు నమోదు

10 Oct, 2020 14:36 IST|Sakshi

భువనేశ్వర్‌ : కోవిడ్‌ మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడంలేదు. సామాన్య ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతగల ప్రజాప్రతినిధిలే నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. కరోనా మార్గదర్శకాలను పాటించకుండా పాజిటివ్‌గా తేలిన ఓ ఎమ్మెల్యే.. బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఒడిశాలోని పూరీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజూ జనతాదళ్‌ (బీజేడీ) సీనియర్‌, ఎమ్మెల్యే ఉమాకంఠ ఇటీవల కరోనా సోకింది. పెద్దగా కోవిడ్‌ లక్షణాలు లేనప్పటికీ రెండు వారాల పాటు స్వీయ నిర్బంధలో ఉండాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే బీజేడీ సీనియర్‌ నేత ప్రదీప్‌ మహారాతి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మరణించారు. (కరోనా: మానసిక ఆరోగ్యంలో మార్పులు)

అయితే కరోనా నేపథ్యంలో అతని అంతిమయాత్రకు ఎవరూ హాజరవ్వదని పోలీసులు హెచ్చరించారు. అంత్యక్రియల్లో సమీప బంధువులకు మాత్రమే అనుమతినిచ్చారు. కానీ కరోనా బారినపడిన అధికార పార్టీ ఎమ్మెల్యే  ఉమాకంఠ కూడా హాజరుకావడం కలకలం రేపింది. కోవిడ్‌ బాధితుడు అంత్యక్రియలకు హాజరుకావడంతో పోలీసులు అతనిపై చర్యలకు ఉపక్రమించారు. ఐపీసీ సెక్షన్‌ 269, 270 (అంటువ్యాధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం), అంటువ్యాధుల నియంత్రణ చట్టం వంటి సెక్షల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఇదే అంత్యక్రియలకు హాజరైన ఇద్దరు మంత్రులపై మాత్రం పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. వారికి కూడా కరోనా సోకిందని, క్వారెంటైన్‌ గడువు ముగియకముందే అంత్యక్రియల్లో పాల్గొన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఎంపీ అపరాజితపై చర్యలు తీసుకోవాలి
భువనేశ్వర్‌: స్థానిక లోక్‌ సభ సభ్యురాలు, భారతీయ జనతా పార్టీకి చెందిన అపరాజిత షడంగికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రాష్ట్రంలోని అధికార పక్షం బిజూ జనతా దళ్‌ డిమాండ్‌ చేసింది. ఆమె జన్మదినం సందర్భంగా శుక్రవారం భారీ సమూహంతో వినోద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ఆమె అభిమానులు, అనుచరులు, శ్రేయోభిలాషులు అంతా కోవిడ్‌–19 నిబంధనలకు నీళ్లొదిలారు. ముఖానికి మాస్కు తొడగకుండా భౌతిక దూరం పాటించకుండా గానా బజానాతో విందు వినోదాల్లో పాల్గొన్న వీడియో శుక్రవారం వైరల్‌ అయింది. కరోనా విజృంభణతో రాజధాని నగరం అల్లాడుతున్న సమయంలో బాధ్యతాయుతమైన ప్రజ్రా ప్రతినిధిగా ఎంపీ అపరాజిత షడంగి నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా విచారం వ్యక్తమైంది. ఎంపీ అపరాజతి షడంగికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని కేంద్ర హోమ్‌ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌కు రాష్ట్ర హోమ్‌ శాఖ సహాయ మంత్రి కెప్టెన్‌ దివ్య శంకర మిశ్రా  లేఖ రాశారు.

కేంద్రమంత్రికి వీడియో క్లిప్పింగ్‌
ఈ నెల 8వ తేదీన స్థానిక ఎంపీ అపరాజిత షడంగి జన్మదిన వేడుకల్ని వందలాది మంది మహిళలతో కలిసి వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమెతో పాల్గొన్న వారంతా  కోవిడ్‌–19 మార్గదర్శకాల్ని బాహాటంగా ఉల్లంఘించారు. ఈ సంఘటన వీడియో క్లిప్పింగు సోషల్‌ మీడియాలో  విస్తృతంగా ప్రసారమవుతోంది. ఈ క్లిప్పింగును కేంద్ర మంత్రికి రాష్ట్రమంత్రి పంపారు. ఎంపీ అపరాజిత షడంగి కోవిడ్‌–19 నిబంధనలకు వరుసగా 3వ సారి ఉల్లంఘించినట్లు రాష్ట్ర హోమ్‌ శాఖ సహాయ మంత్రి కెప్టెన్‌ దివ్య శంకర మిశ్రా ఈ సందర్భంగా లేఖలో గుర్తు చేశారు. లోగడ ఆమెకు జారీ చేసిన హెచ్చరికల్ని గాలికి వదిలి కోవిడ్‌ నిబంధనల్ని బాహాటంగా ఉల్లంఘిస్తున్నారు. ఆమె బాధ్యతారాహిత్యమైన చర్యలు కరోనా యోధుల ఉత్సాహాన్ని నిర్వీర్యం చేసి పరిస్థితుల్ని విషమంగా మలుస్తాయని మంత్రి దివ్య శంకర మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. నగర ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టే కోవిడ్‌–19 నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఎంపీకి వ్యతిరేకంగా చర్యలు చేపట్టేందుకు కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి,  ప్రధాన మంత్రికి సిఫారసు చేయాలని లేఖలో కోరారు.    

మరిన్ని వార్తలు