జర్నలిస్టులకు లక్షల్లో ‘క్యాష్‌ గిఫ్ట్‌లు’.. మరో వివాదంలో కర్ణాటక ప్రభుత్వం

29 Oct, 2022 17:00 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక అధికార బీజేపీ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కార్యాలయానికి చెందిన అధికారి ఒకరు జర్నలిస్టులకు ‘క్యాష్‌ గిఫ్ట్‌లు’ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. పలువురు జర్నలిస్టులకు మిఠాయి బాక్సులతో పాటు రూ.లక్ష నుంచి రూ.2.50లక్షల వరకు నగదు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్ష కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. సీఎంఓ స్వీట్‌ బాక్సులతో లంచాలు ఇచ్చిందని ఆరోపించింది.

దీపావళి పండగను పురస్కరించుకుని పలు మీడియా సంస్థలకు చెందిన 10 మందికిపైగా సీనియర్‌ జర్నలిస్టులకు సీఎంఓ నుంచి స్వీటు బాక్సులు గిఫ్ట్‌లుగా వెళ్లాయి. అయితే అందులో మిఠాయిలతో పాటు రూ.లక్షల్లో డబ్బులు ఉన్నట్లు కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. స్వీటు బాక్సుల్లో నగదు ఉన్నట్లు ముగ్గురు జర్నలిస్టులు స్వయంగా అంగీకరించినట్లు పేర్కొన్నాయి. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన డబ్బును తిప్పి పంపించినట్లు అందులోని ఇద్దరు జర్నలిస్టులు వెల్లడించినట్లు ద న్యూస్‌ మినట్‌ పేర్కొంది. ‘సీఎం కార్యాలయం నుంచి నాకు స్వీట్‌ బాక్సు వచ్చింది. తెరిచి చూడగా అందులో రూ.1 లక్ష క్యాష్‌ ఉంది. ఈ విషయాన్ని మా ఎడిటర్స్‌కు తెలియజేశాను. ఆ నగదును తాను తీసుకోనని సీఎంఓ అధికారులకు తెలిపాను. ఇది చాలా తప్పు.’ అని మరో జర్నలిస్టు పేర్కొన్నారు. 

జర్నలిస్టులకు క్యాష్‌ గిఫ్ట్‌ల వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై అవినీతికి వ్యతిరేకంగా పని చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ.. కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి బొమ్మై మీడియా అడ్వైజర్‌ పలు మీడియా సంస్థల చీఫ్‌ రిపోర్టర్లకు ఈ గిఫ్ట్‌లు అందించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేసింది.

కాంగ్రెస్ విమర్శలు..
జర్నలిస్టులకు నగదు గిఫ్ట్‌ల నేపథ్యంలో బీజేపీ సర్కారుపై ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.‘సర్కారు  రూ.లక్షల్లో లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఇది సీఎం ఆపర్‌ చేసిన లంచం కాదా? ఈ  లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభుత్వ ఖజానా నుంచా లేదా సీఎం వ్యక్తిగత ఖాతా నుంచా? దీనిపై ఈడీ/ఐటీ చర్యలు తీసుకుంటుందా? ఈ ప్రశ్నలకు బొమ్మై సమాధానం చెప్పగలరా?’ అని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా ట్విటర్‌లో విమర్శించారు. దీనిపై జ్యుడిషియల్‌ దర్యాప్తు జరిపించాలని  కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

ఇదీ చదవండి: సీఎం ముఖచిత్రంతో ‘పేసీఎం’.. కర్ణాటక సర్కార్‌పై కాంగ్రెస్‌ అస్త్రం!

>
మరిన్ని వార్తలు