CAT 2021: ఐఐఎంలకు దారిచూపే.. క్యాట్‌!

14 Aug, 2021 18:22 IST|Sakshi

క్యాట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల

నవంబర్‌ 28న ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష

76 ప్రశ్నలు–రెండు గంటల సమయం 

ఐఐఎంలు.. మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ప్రఖ్యాతిగాంచిన ఇన్‌స్టిట్యూట్స్‌! వీటిల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష.. క్యాట్‌(కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌)!! ఐఐఎం అహ్మదాబాద్‌.. క్యాట్‌–2021 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఐఐఎంలతోపాటు దేశంలోని పలు ప్రముఖ బీస్కూల్స్‌లో ప్రవేశానికి క్యాట్‌ స్కోర్‌ కీలకంగా నిలుస్తోంది.

ఈ నేపథ్యంలో.. క్యాట్‌ పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌.. ఎంబీఏ, పీజీడీఎం, పీజీపీఎం వంటి మేనేజ్‌ మెంట్‌ కోర్సులను ప్రముఖ బీస్కూల్స్‌లో చదివిన ప్రతిభావంతులకు కార్పొరేట్‌ కంపెనీలు రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నాయి. లక్షల్లో ప్యాకేజీలు ఆఫర్‌ చేస్తాయి. ముఖ్యంగా ఐఐఎంల్లో ఎంబీఏ పూర్తి చేస్తే.. కార్పొరేట్‌ కంపెనీలకు హాట్‌కేకే!! అందుకే పేరున్న ఇన్‌స్టిట్యూట్స్‌లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. క్యాట్‌లో స్కోర్‌ తోపాటు మలిదశలో ప్రతిభ చూపితేనే వీటిల్లో అడ్మిషన్‌ ఖాయం అవుతుంది. 
 

అర్హత

కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్లు్యడీ అభ్య ర్థులకు డిగ్రీలో కనీసం 45శాతం మార్కులు రావాలి. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు/ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తు న్నవారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక విధానం
► ప్రతి ఏటా క్యాట్‌కు 2 లక్షల మందికి పైగా అభ్య ర్థులు హాజరవుతుంటారు. గతేడాది దాదాపు 2.27 లక్షల మంది పరీక్ష రాసారు. క్యాట్‌కు హాజరవడం అనేది ఐఐఎంల ఎంపిక ప్రక్రియలో ఎంతో కీలకమైన మొదటి దశ. ఈ పరీక్షలో నిర్దేశిత కటాఫ్‌ స్కోర్‌ సాధించిన అభ్యర్థులను మలిదశకు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. 

► మలి దశలో..గ్రూప్‌ డిస్కషన్‌(జీడీ), రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌(వాట్‌), పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 

► పలు ఐఐఎంలు గత అకడెమిక్‌ రికార్డ్, సంబంధిత పని అనుభవం, జెండర్‌ అండ్‌ అకడెమిక్‌ డైవర్సిటీ వంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. 


76 ప్రశ్నలు–మూడు విభాగాలు

► క్యాట్‌ పరీక్ష ఆన్‌లైన్‌(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో జరుగుతుంది. 

► పరీక్షలో మూడు విభాగాల నుంచి మొత్తం 76 ప్రశ్నలు ఉంటాయి. 

► వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ (వీఏఆర్‌సీ) నుంచి 26 ప్రశ్నలు వస్తాయి. 

► డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ (డీఐఎల్‌ఆర్‌) నుంచి 24 ప్రశ్నలు ఉంటాయి. 

► క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ(క్యూఏ) విభాగం నుంచి 26 ప్రశ్నలు అడుగుతారు. 

► మొత్తం 76 ప్రశ్నలు–228 మార్కులకు క్యాట్‌ పరీక్ష నిర్వహిస్తారు. 

► ఈ పరీక్షలో నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కులు లభిస్తాయి. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. 

► ప్రశ్నలు మల్టిపుల్‌ ఛాయిస్, నాన్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌(టైప్‌ ఇన్‌ ది ఆన్సర్‌) విధానంలో ఉంటాయి. నాన్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు నెగిటివ్‌ మార్కులుండవు. 

పరీక్ష సమయం రెండుగంటలు
ఈ ఏడాది క్యాట్‌ పరీక్ష సమయం రెండు గంటలు. ఒక్కో సెక్షన్‌కు 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. రెండు గంటల్లో మొత్తం ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. ఇలా మూడు ఆన్‌లైన్‌ స్లాట్స్‌ ఉంటాయి. 


టైమ్‌ మేనేజ్‌మెంట్‌

గతేడాది నుంచి ‘క్యాట్‌’ సమయం తగ్గింది. అందువల్ల అభ్యర్థులు ‘గోల్‌ సెట్టింగ్‌ థియరీ’ ప్రకారం చదివితే విజయం సాధించగలరు అంటున్నారు నిపుణులు. అంటే.. పరీక్షలో మూడు సెక్షన్లతోపాటు ‘టైమ్‌ మేనేజ్‌మెంట్‌’ను నాలుగో విభాగంగా పరిగణించాలి. అభ్యర్థులు ఏదైనా విభాగాన్ని పరిష్కరించడానికి 40 నిమిషాల కంటే ఎక్కువ సమయం అందుబాటులో ఉండదు. ఈ సమయంలోనే మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలతోపాటు టైప్‌ చేసే ప్రశ్నలకు కూడా సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
బలాబలాలు

క్యాట్‌ విభిన్నంగా, క్లిష్టంగా ఉంటుంది. ఇందులో మంచి స్కోర్‌ సాధించాలంటే.. వేగంతోపాటు కచ్చితత్వం చాలా అవసరం. పరిమిత కాలంలో క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తమ శక్తి సామర్థ్యా లను అంచనా వేసుకోవాలి. ఏ విభాగం ప్రశ్నలకు వేగంగా సమాధానాలు గుర్తించగలుగుతున్నారు.. ఏ విభాగంలో బలహీనంగా ఉన్నారో తెలుసు కోవాలి. వెనుకబడిన విభాగంలో ఇప్పటికే ప్రాక్టీస్‌ చేసిన నమూనా ప్రశ్నలను మరోసారి సాధించాలి. 


మాక్‌ టెస్టులు 

► క్యాట్‌–2021 పరీక్ష నవంబర్‌ 28న నిర్వహిం చనున్నారు. అంటే.. దాదాపు నాలుగు నెలల సమయం అందుబాటులో ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి సీరియస్‌గా ప్రిపరేషన్‌ ప్రారం భించినా.. టాప్‌ స్కోరు సాధించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 

► ముఖ్యంగా పరీక్షలోని మూడు విభాగాల్లో ఒక్కో దానికి నెలరోజుల చొప్పున సమయం కేటాయిం చి చదవడం మంచిది. చివర్లో మిగతా నెలరోజు ల పాటు పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌ చేయాలి. 

► గత ఐదేళ్ల పాత ప్రశ్న పత్రాలను పరిశీలించి.. ప్రశ్నల శైలిని పరిశీలించాలి. ఏ టాపిక్‌లో ఎలాం టి మార్పులతో ప్రశ్నలు వస్తున్నాయో గుర్తిం చాలి. అందుకు అనుగుణంగా ప్రిపరేషన్‌ సాగి స్తూ.. మాక్‌ టెస్టులు సైతం ప్రాక్టీస్‌ చేయాలి.
 
ముఖ్యమైన సమాచారం
► దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
► దరఖాస్తులకు చివరి తేది:  15.09.2021
► దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలకు రూ.1100, ఇతరులకు రూ.2200.
► హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రారంభం: అక్టోబర్‌ 27–నవంబర్‌ 28
► ఆన్‌లైన్‌ క్యాట్‌–2021 పరీక్ష తేది: నవంబర్‌ 28, 2021
► ఫలితాల వెల్లడి: జనవరి రెండో వారం 2022
► పూర్తి వివరాలు, ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు వెబ్‌సైట్‌: https://iimcat.ac.in

మరిన్ని వార్తలు