ఆర్‌–ఫ్యాక్టర్‌.. పెరుగుదల ఆందోళనకరం: ‘ఎయిమ్స్‌’ చీఫ్‌

2 Aug, 2021 00:56 IST|Sakshi

‘ఎయిమ్స్‌’ చీఫ్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా 

కరోనా నియంత్రణ చర్యలు కఠినతరం చేయాలి

న్యూఢిల్లీ: దేశంలో ఆర్‌–వాల్యూ(ఆర్‌–ఫ్యాక్టర్‌) క్రమంగా పెరుగుతోందని, ఇది నిజంగా ఆందోళనకర పరిణామమేనని ఢిల్లీలోని ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా చెప్పారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్న ప్రాంతాల్లో నియంత్రణ చర్యలను కఠినతరం చేయాలని సూచించారు. కరోనా వ్యాప్తి శృంఖలాన్ని తెంచడానికి ‘టెస్టు, ట్రాక్, ట్రీట్‌’ అనే వ్యూహాన్ని కచ్చితంగా పాటించాలని చెప్పారు. ఆర్‌–వాల్యూ అనేది కరోనా వ్యాప్తి తీరును గుర్తించే ఒక సూచిక. ప్రారంభంలో ఆర్‌–వాల్యూ రేటు 0.96గా ఉండేదని, ఇప్పుడు 1 దాటేసిందని రణదీప్‌ గులేరియా పేర్కొన్నారు. అంటే కరోనా బాధితుడి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్‌ వ్యాప్తి చెందే అవకాశాలు పెరుగుతున్నట్లేనని వివరించారు.

దేశంలో 46 రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు కొన్ని వారాలుగా 10 శాతం కంటే అధికంగా నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.  కరోనా వైరస్‌ ఆర్‌–ఫ్యాక్టర్‌ సైతం క్రమంగా పెరుగుతోంది. ఇంట్లో ఒకరికి ఈ వైరస్‌ సోకితే మిగిలినవారికి కూడా అంటుకుంటున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. కుటుంబంలో ఒకరికి కరోనా డెల్టా వేరియంట్‌ సోకితే మిగిలినవారు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది’’ అని  గులేరియా పేర్కొన్నారు. కేరళలో పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరగుతున్నాయని, దీని వెనుక కొత్త వేరియంట్‌ ఏదైనా ఉందా అనేది తేలాల్సి ఉందని చెప్పారు.

తమిళనాడులో 66 శాతం మందిలో ప్రతిరక్షకాలు(యాంటీబాడీస్‌) వృద్ధి చెందినట్లు వెల్లడయ్యిందని వివరించారు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. మనుషుల్లో కొంతకాలం తర్వాత ప్రతిరక్షకాలు తగ్గుతాయని, కేసులు మళ్లీ ఉధృతం కావడానికి ఇదీ ఒక కారణమేనన్నారు. అయితే, ప్రతిరక్షకాలు తగ్గినవారికి కరోనా సోకితే వారి నుంచి వ్యాప్తి చెందే వైరస్‌ తీవ్రత అంతగా ఉండదని అన్నారు.   

మరిన్ని వార్తలు