పీఎన్‌బీకి చోక్సి కంపెనీలు 6 వేల కోట్ల టోకరా

17 Jun, 2021 03:14 IST|Sakshi

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాభరణాల వ్యాపారి మెహుల్‌ చోక్సికి చెందిన సంస్థలు.. నకిలీ లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌ (ఎల్‌వోయూ), ఫారిన్‌ లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌ల (ఎఫ్‌ఎల్‌సీ) ద్వారా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును (పీఎన్‌బీ) రూ. 6,345 కోట్ల మేర మోసగించినట్లు సీబీఐ విచారణలో తేలింది. ముంబైలోని ప్రత్యేక కోర్టుకి సీబీఐ గత వారం ఈ మేరకు సప్లిమెంటరీ చార్జిషీటును సమర్పించింది. చోక్సి, ఆయన కంపెనీల సిబ్బందితో పీఎన్‌బీ ఉద్యోగులు కుమ్మక్కై ఈ కుంభకోణానికి తెరతీశారని ఇందులో పేర్కొంది.

2017 మార్చి–ఏప్రిల్‌లో ఎలాంటి మార్జిన్లు లేకుండా, బ్యాంకు సిస్టమ్‌లో ఎంట్రీలు చేయకుండా ముంబైలోని బ్రాడీ హౌస్‌ బ్రాంచ్‌లోని పీఎన్‌బీ ఉద్యోగులు.. చోక్సి కంపెనీలకు 165 ఎల్‌వోయూలు, 58 ఎఫ్‌ఎల్‌సీలు జారీ చేశారని తెలిపింది. వీటి ద్వారా విదేశీ బ్యాంకుల నుంచి చోక్సి సంస్థలు భారీగా రుణాలు తీసుకున్నాయి. కానీ వాటిని తిరిగి కట్టకపోవడంతో వడ్డీతో కలిపి రూ. 6,345 కోట్లను విదేశీ బ్యాంకులకు పీఎన్‌బీ చెల్లించిందని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని తెలిపింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు