సీబీఐ మాజీ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా మృతి

17 Apr, 2021 02:26 IST|Sakshi

న్యూఢిల్లీ: సీబీఐ మాజీ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా (68) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన కోవిడ్‌ కారణంగా మరణించి ఉండవచ్చని సీనియర్‌ అధికారులు తెలిపారు. రంజిత్‌ సిన్హాకు కరోనా పరీక్షలు చేపట్టగా గురువారం రాత్రి పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం వేకువజామున 4.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని అధికారులు వెల్లడించారు. బిహార్‌ కేడర్‌కు చెందిన 1974 బ్యాచ్‌ అధికారి రంజిత్‌ 21 ఏళ్లకే యూపీఎస్‌సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు.

ఐటీబీపీ, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లలో కీలక బాధ్యతలు నిర్వహించారు. సిన్హా హయాంలో బొగ్గు కుంభకోణంపై సీబీఐ చేపట్టిన దర్యాప్తు వివాదస్పదమైంది. అప్పటి న్యాయ మంత్రి అశ్వనీ కుమార్, పలువురు ఉన్నతాధికారులు తన నివాసానికి వచ్చి సమావేశాలు జరిపారనీ, వాటి ఫలితంగానే బొగ్గు కుంభకోణం విచారణ నివేదికలో పలు మార్పులు చేపట్టామని ఆయన సుప్రీంకోర్టుకిచ్చిన నివేదికలో వెల్లడించడం గమనార్హం.

దీనిపై జస్టిస్‌ ఆర్‌ఎం లోథా తీవ్ర వ్యాఖ్యలు చేయగా, అవి నిజమేనంటూ సిన్హా మీడియా ఎదుట ఒప్పుకోవడం సంచలనమైంది. అనంతరం సీబీఐ 2జీ కుంభకోణంపై చేపట్టిన దర్యాప్తు చుట్టూ కూడా వివాదం ఏర్పడింది. ఈ కుంభకోణంలోని కీలక సూత్రధారులు కొందరు సిన్హా నివాసానికి వెళ్లినట్లు వెల్లడైంది. సుప్రీం ఆదేశాల మేరకు సీబీఐ చీఫ్‌గా ఉన్న సిన్హా ఆ కేసు విచారణ నుంచి వైదొలిగారు.

చదవండి: కుంభమేళాలో కరోనా.. రెండుగా చీలిన సాధువులు

మరిన్ని వార్తలు