డీకే శివకుమార్‌ ఇంటిపై సీబీఐ దాడులు

5 Oct, 2020 10:36 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంటిపై సోమవారం ఉదయం ఆకస్మిక దాడులు చేసిన అధికారులు, కర్ణాటకలోని దొడ్డనహళ్లి, కనకాపుర, సదాశివ నగర్‌తో పాటు ముంబై తదితర 14 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. సుమారు 60 మంది అధికారులు ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. డీకే శివ కుమార్‌తో పాటు ఆయన సోదరుడు డీకే సురేష్‌కు సంబంధించిన నివాసాల్లోనూ దాడులు కొనసాగుతున్నాయి.(చదవండి: డీకే రవి భార్యకు కాంగ్రెస్‌ బంపర్‌ ఆఫర్‌)

కాగా రాజరాజేశ్వర నగర్‌, సిరా అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న తరుణంలో కాంగ్రెష్‌ పార్టీ ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌ ఇంటిపై సీబీఐ దాడులు నిర్వహించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ తమను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కేంద్రం కక్షపూరిత చర్యలకు దిగిందంటూ కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా.. ప్రధాని మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప చేతిలో తోలుబొమ్మగా మారిన సీబీఐ డీకే శివకుమార్‌ నివాసంలో సోదాలు చేస్తోందంటూ మండిపడ్డారు.

ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు తమను ఏమీ చేయలేవన్నారు. కర్ణాటకలో బీజేపీ సర్కారు అవినీతిని సీబీఐ తొలుత బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య సైతం సీబీఐ దాడులను ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ ఇలాంటి చర్యలకు పూనుకుందంటూ ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గతేడాది సెప్టెంబరులో డీకే శివకుమార్‌ను ఢిల్లీలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుమారు 50 రోజుల పాటు ఆయన జైలులోనే ఉన్నారు. అనేక అభ్యర్థనల అనంతరం బెయిలు మంజూరైన తర్వాత తీహార్‌ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.

మరిన్ని వార్తలు