2.78 లక్షల అక్రమ గన్‌ లైసెన్స్‌లు!

25 Jul, 2021 00:53 IST|Sakshi

2012–2016లో జమ్మూకశ్మీర్‌లో జారీ 

దర్యాప్తు ముమ్మరం చేసిన సీబీఐ 

ఒకేరోజు 40 చోట్ల సోదాలు 

ఐఏఎస్‌ అధికారుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు

శ్రీనగర్‌/న్యూఢిల్లీ: ఆయుధాల అక్రమ లైసెన్స్‌ల వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణను ముమ్మరం చేసింది. జమ్మూకశ్మీర్‌తోపాటు దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఒకేరోజు 40 చోట్ల సోదాలు నిర్వహించింది. 2012 నుంచి 2016 దాకా ఐదేళ్లపాటు జమ్మూకశ్మీర్‌లో ఏకంగా 2.78 లక్షలకు పైగా ఆయుధ లైసెన్స్‌లను స్థానికేతరులకు జారీ చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగాయని, అనర్హులు ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించి లైసెన్స్‌లు పొందినట్లు సీబీఐ గుర్తించింది.

ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించేందుకు సీబీఐ అధికారులు జమ్మూ, శ్రీనగర్, ఉధంపూర్, రాజౌరీ, అనంతనాగ్, బారాముల్లా, ఢిల్లీలలో 40 చోట్ల సోదాలు జరిపారు. ఆయుధాల లైసెన్స్‌ల రాకెట్‌ను ఛేదించేందుకు కొందరు ఐఏఎస్‌లతోపాటు ప్రభుత్వ అధికారుల నివాసాలు, కార్యాలయాలు, 20 ఆయుధాల దుకాణాల్లో ఈ సోదాలు చేపట్టామని సీబీఐ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వ గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి, ఐఏఎస్‌ అధికారి షాహిద్‌ ఇక్బాల్‌ చౌదరి, మరో ఐఏఎస్‌ అధికారి, ఢిల్లీలో అడిషనల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ యూటీ నీరజ్‌ కుమార్‌ నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు సాగినట్లు తెలిపారు. 

స్థానికేతరులకు లైసెన్సులు 
రాజౌరీ జిల్లా మాజీ కలెక్టర్, రిటైర్డ్‌ అధికారి షబ్బీర్‌ అహ్మద్‌ భట్‌ నివాసంతోపాటు పూంచ్, కుప్వారా, బందీపురా, బారాముల్లా, రాంబన్‌ జిల్లాల్లో 2012–2016లో అదనపు మేజిస్ట్రేట్లుగా పని చేసిన ఆరుగురు అధికారుల ఇళ్లల్లోనూ సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. ఆయుధాల లైసెన్సుల జారీలో అక్రమాలపై సీబీఐ 2018 అక్టోబర్‌ 16న రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 2019 డిసెంబర్‌లో శ్రీనగర్, జమ్మూ, గుర్గావ్, నోయిడాలలో పలువురు అధికారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. జమ్మూకశ్మీర్‌లో పలు జిల్లాల్లో మేజిస్ట్రేట్లుగా పనిచేసిన అధికారులు ఆయుధాల లైసెన్సుల జారీలో పెద్ద ఎత్తున అవినీతి ఆక్రమాలకు పాల్పడినట్లు, అనర్హులకు వీటిని అందజేసినట్లు ఫిర్యాదులొచ్చాయి.

చాలామంది స్థానికంగా నివాసం ఉండకుండానే ఉన్నట్లు తప్పుడు పత్రాలు సమర్పించిన లైసెన్సులు పొందినట్లు తమ పరిశీలనలో తేలిందని, ఇందులో పలువురు ఆయుధ డీలర్ల పాత్ర ఉందని సీబీఐ ప్రతినిధి ఆర్‌.సి.జోషీ చెప్పారు. స్థానికేతరులకు ఆయుధ లైసెన్సులు ఇవ్వడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో 22 జిల్లాల్లో ఈ తరహా అక్రమాలు జరిగాయన్నారు. అక్రమ లైసెన్సుల కుంభకోణాన్ని తొలుత 2017లో రాజస్తాన్‌ ఏటీఎస్‌ బహిర్గతం చేసింది. అప్పట్లో 50 మందిని అరెస్టు చేసింది. సైనిక సిబ్బంది పేరిట 3,000కు పైగా లైసెన్సులు జారీ చేశారని రాజస్తాన్‌ ఏటీఎస్‌ వెల్లడించింది. ఏటీఎస్‌ సేకరించిన ఆధారాలను బట్టి అప్పటి జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ ఎన్‌.ఎన్‌.వోహ్రా ఈ కేసును సీబీఐకి అప్పగించారు. 

సీబీఐకి పూర్తిగా సహకరిస్తా: షాహిద్‌ ఇక్బాల్‌ చౌదరి
ఆయుధాల లైసెన్స్‌ల కేసులో తన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు జరిపిన మాట నిజమేనని షాహిద్‌ ఇక్బాల్‌ చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కేసులో నేరారోపణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు సీబీఐకి లభించలేదని చెప్పారు. సీబీఐకి పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. 2012–2016 మధ్యకాలంలో ఉధంపూర్‌లో 36,000 లైసెన్స్‌లు జారీ చేశారని, తన హయాంలో కేవలం 1,500 లైసెన్సులే జారీ అయ్యాయని స్పష్టం చేశారు. తన హయాంలో ఇచ్చిన లైసెన్స్‌లకు తాను జవాబుదారీగా ఉంటానని అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల కంటే తానే తక్కువ లైసెన్స్‌లు జారీ చేశానని చెప్పారు. ఈ కేసు విషయంలో సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. తాను 2012–2016 మధ్య జమ్మూకశ్మీర్‌లోని రియాసీ, కథువా, ఉధంపూర్‌ జిల్లాల మేజిస్ట్రేట్‌గా పనిచేశానని గుర్తుచేశారు. ఈ మూడు జిల్లాల్లో కలిపి 2012–2016 మధ్యకాలంలో మొత్తం 56,000 ఆయుధ లైసెన్స్‌లు జారీ చేశారని, తన హయాంలో కేవలం 1,720 లైసెన్సులు ఇచ్చారని, మొత్తం లైసెన్సుల్లో ఇవి 3 శాతమేనని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు