నితీశ్‌ బలపరీక్ష రోజే.. ఆర్జేడీ నేతల ఇళ్లలో సీబీఐ సోదాలు

24 Aug, 2022 10:20 IST|Sakshi

పాట్నా: బిహార్‌లో నితీశ్‌ కూమార్‌ నేతృత్వంలోని మహా గట్‌బంధన్‌ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న కొన్ని గంటల ముందు ఆర్జేడీ సీనియర్‌ నేతల ఇళ్లపై దాడులు జరగటం సంచలనంగా మారింది. ముగ్గురు సీనియర్‌ నేతల నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బుధవారం తనిఖీలు చేపట్టింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా లాలూప్రసాద్‌ ఉన్న రోజుల్లో జరిగిన ‘ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌’ కుంభకోణం దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

పాట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్‌ నివాసం సహా ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ అహ్మద్‌ అష్ఫాఖ్‌ కరీమ్‌, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ సుబోధ్‌ రాయ్‌ నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. ‘ఈ సోదాలు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. అందులో ఎలాంటి అర్థం లేదు. భయంతో మా ఎమ్మెల్యేలు వారితో చేరతారనే కారణంగా చేస్తున్నారు.’అని పేర్కొన్నారు ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్‌. 

ముందే ట్వీట్‌..
దాడులకు కొన్ని గంటల ముందు ఆర్జేడీ అధికార ప్రతినిధి సీబీఐ దాడులపై ట్వీట్‌ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. బిహార్‌లో అధికారం కోల్పోవటంపై బీజేపీ కోపంగా ఉందని, అందుకే సీబీఐ, కేంద్ర ఏజెన్సీలతో దాడులు చేపట్టేందుకు సిద్ధమైందన్నారు. బుధవారం కీలకమైన రోజుగా ఆయన పేర్కొనటం గమనార్హం.

ఇదీ చదవండి: అవిశ్వాస తీర్మానం పెట్టినా.. రాజీనామా చెయ్యను! బీహార్‌ స్పీకర్‌ మొండిపట్టు

మరిన్ని వార్తలు