నిన్న విపక్షాల లేఖ.. నేడు రబ్రీ దేవి ఇంటికి సీబీఐ అధికారులు

6 Mar, 2023 12:37 IST|Sakshi

పాట్నా: బీహార్‌ రాజకీయాల్లో ఇవాళ ఒక్కసారిగా అలజడి రేగింది. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ బృందం ఒకటి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సతీమణి, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి అయిన రబ్రీ దేవి ఇంటికి వెళ్లింది. సోమవారం పాట్నాలోని ఆమె నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ స్కాంలో  ఆమెను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో తనయులు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.

అయితే.. ఈ కుంభకోణానికి సంబంధించి కేవలం ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకే వెళ్లినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అంతేగానీ తనిఖీలు, సోదాలు నిర్వహించేందుకు కాదని స్పష్టత ఇచ్చాయి. మరోవైపు ముందు తీసుకున్న అపాయింట్‌మెంట్‌ ప్రకారమే అధికారులు ఇంటికి వచ్చారని రబ్రీ దేవి అనుచరులు చెప్తున్నారు. 

ఇదిలా ఉంటే.. రాజకీయ ఉద్దేశ్యాలతో దర్యాప్తు సంస్థలను తప్పుడు దోవలో కేంద్రం ప్రతిపక్షాలపై ప్రయోగిస్తోందని ఆరోపిస్తూ..  ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాయి. ఈ లేఖలో రబ్రీ దేవి తనయుడు, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ సైతం సంతకం చేశారు. అంతేకాదు.. దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకున్న నేతల్లో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా ఉన్నారంటూ ఆ లేఖలో ప్రస్తావించారు. 

సీబీఐ ప్రకారం.. ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కుంభకోణం లాలూ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. 2004-09 మధ్య రైల్వే ఉద్యోగాలు కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా లాలూ కుటుంబం కారుచౌక ధరలను చెల్లించి భూముల్ని కొనుగోలు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి మే 2022లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కూతుళ్లు మీసా, హేమలతో పాటు మరికొందరి పేర్లను చేర్చింది. ఆపై ఛార్జ్‌షీట్‌ కూడా దాఖలు చేసింది.

మరోవైపు భూములు అప్పజెప్పి.. ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్న 12 మంది పేర్లను సైతం ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ చేర్చింది. అంతేకాదు గతంలో లాలూకు ఓఎస్‌డీ(ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ)గా పని చేసిన భోళా యాదవ్‌ను సీబీఐ అరెస్ట్‌ కూడా చేసింది. ఇప్పటికే లాలూ కుటుంబాన్ని ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి పొందింది సీబీఐ. ఇదిలా ఉంటే.. వారం కిందట ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం ఢిల్లీ కోర్టులో లాలూ, ఇతరులు హాజరయ్యారు కూడా. 

ఇక బీజేపీ దర్యాప్తు సంస్థల బూచీతో బయటపెట్టాలని యత్నిస్తోందని, లాలూ కుటుంబం అలాంటి వాటికి బెదరదని, గత 30 ఏళ్లుగా ఇలాంటి ఆరోపణలు తాము ఎదుర్కొంటున్నామని రబ్రీ దేవి తాజాగా ఓ ప్రకటన చేశారు కూడా. 

మరిన్ని వార్తలు