సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు 

2 Jun, 2021 03:01 IST|Sakshi

ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం -

అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం 

విద్యార్థుల ప్రయోజనాల కోసమేనన్న మోదీ 

సాక్షి, న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యున్నత ప్రమాణాలను అనుసరించి నిర్దిష్ట కాలవ్యవధిలో 12వ తరగతి ఫలితాలను వెల్లడించేందుకు సీబీఎస్‌ఈ తగిన చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రం సూచించింది. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశంలో వెల్లడించారు. ప్రధాని అధ్యక్షతన మంగళవారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది పరీక్షలు ప్రారంభమైన కొద్దిరోజులకు కోవిడ్‌–19తో లాక్‌డౌన్‌ విధింపు, కేసుల పెరుగుదల కారణంగా పరీక్షల రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెకండ్‌ వేవ్‌లో అనూహ్యంగా కరోనా కేసులు పెరగడం, ప్రాణనష్టం ఉండడంతో సీబీఎస్‌ఈ బోర్డు పదో తరగతి పరీక్షలను కేంద్రం రద్దు చేసింది. పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేసింది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలవగా, గత ఏడాది తీసుకున్న నిర్ణయం కంటే భిన్నమైన నిర్ణయం తీసుకుంటే అందుకు సహేతుక కారణాలు ఉండాలని సోమవారం నాటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియపరిచింది.

జూన్‌ మూడో తేదీన తదుపరి విచారణ ఉండగా మంగళవారం ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరీక్షలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయించింది. ఈ సమావేశానికి ముందే కేంద్ర విద్యా శాఖ సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై రాష్ట్రాల అభిప్రాయాలు సేకరించింది. మెజారిటీ రాష్ట్రాలు పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపాయి. అయితే విద్యార్థులకు వ్యాక్సిన్‌ వేశాకే పరీక్షలు నిర్వహించాలని మరికొన్ని రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకే బోర్డు మొగ్గు చూపింది. కానీ సుప్రీంకోర్టు తాజా విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రం పరీక్షల రద్దుకు నిర్ణయించింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు, స్పందనలను వివరిస్తూ ఉన్నతాధికారులు ప్రధానికి ఈ సమావేశంలో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 


ఆందోళనకు తెరపడాలి: ప్రధాని 
కోవిడ్‌ మహమ్మారి కారణంగా అకడమిక్‌ క్యాలెండర్‌ దెబ్బతిన్నదని, బోర్డు పరీక్షల నిర్వహణపై నెలకొన్న అనిశ్చితి... విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన పెంచిందని ప్రధాన మంత్రి విచారం వ్యక్తంచేశారు. ఈ ఆందోళనకు వెంటనే ముగింపు పలకాల్సిన అవసరం వచ్చిందని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలు సూక్ష్మస్థాయిలో కట్టడి చర్యలు చేపడుతూ కరోనాను నియంత్రిస్తున్నాయని, మరికొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఎంచుకున్నాయని వివరించారు. ఈ దశలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన చెందారని తెలిపారు. ఈ ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేలా బలవంతపెట్టరాదని వివరించారు. విద్యార్థుల ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని, దీనిపై రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

విద్యార్థులు రిస్క్‌లో పడేందుకు ఈ పరీక్షలు కారణం కాకూడదని సూచించారు. ఈ ప్రక్రియలో భాగస్వాములందరితో చర్చించి విద్యార్థి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడానికి దోహదపడిన సంప్రదింపుల కార్యక్రమాన్ని ప్రశంసించారు. రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా గత ఏడాదిలాగే ఎవరైనా విద్యార్థులు పరీక్ష రాయాలనుకుంటే పరిస్థితులు చక్కబడిన తరువాత సీబీఎస్‌ఈ అందుకు అవకాశాన్ని ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం ఇదివరకు మే 21న జరిగింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన మరోసారి మే 25న సమావేశం జరిగింది. ఈసమావేశంలో వివిధ రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని చర్చించారు. తాజా సమావేశంలో కేంద్ర హోం శాఖ, రక్షణ శాఖ, వాణిజ్య శాఖ, సమాచార ప్రసార శాఖ, పెట్రోలియం శాఖ, స్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ   

మరిన్ని వార్తలు