పరీక్షా కేంద్రం నగరాన్ని మార్చుకునేందుకు ఓకే: సీబీఎస్‌ఈ

21 Oct, 2021 12:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెలలో ప్రారంభంకానున్న 10, 12 తరగతుల మొదటి టర్మ్‌ బోర్డు పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రం నగరాన్ని మార్చుకొనేందుకు సీబీఎస్‌ఈ అనుమతించింది. అడ్మిషన్‌ తీసుకున్న నగరంలో కాకుండా విద్యార్థి వేరే నగరంలో ఉన్న పరిస్థితుల్లో ఆ నగరంలో పరీక్ష రాసేందుకు అవకాశాన్ని కల్పిస్తూ సీబీఎస్‌ఈ బుధవారం ప్రకటన జారీ చేసింది.

కొందరు విద్యార్థులు వారు అడ్మిషన్‌ తీసుకున్న నగరంలో కాకుండా ఇప్పటికీ ఇతర నగరాల్లో నివసిస్తున్నారని సీబీఎస్‌ఈ దృష్టికి వచ్చిందని ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ సన్యామ్‌ భరద్వాజ్‌ తెలిపారు. ఈ పరిస్థితుల్లో పరీక్షా కేంద్రం నగరాన్ని మార్చడానికి విద్యార్థుల సంబంధిత పాఠశాలలకు ఒక అభ్యర్థన చేసేందుకు నిర్ధిష్ట సమయాన్ని ఇవ్వనున్నామని పేర్కొన్నారు.

ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న విద్యార్థులు, ఆ సమయంలో దరఖాస్తు చేసుకుంటేనే బోర్డు అంగీకరిస్తుందని భరద్వాజ్‌ తెలిపారు. కాగా 10వ తరగతి ఫస్ట్‌ టర్మ్‌ పరీక్షలు నవంబర్‌ 30 నుంచి, 12 తరగతి పరీక్షలు డిసెంబర్‌ 1 నుంచి నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైన విషయం తెలిసిందే. (ఈ కోర్సులు చదవితే జాబ్‌ ఆఫర్లు అపారం!)

మరిన్ని వార్తలు