గాల్లో కరోనా వ్యాప్తిపై సీసీఎంబీ శోధన

29 Sep, 2020 04:21 IST|Sakshi

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు నడుం బిగించారు. ఆసుపత్రి వాతావరణంలో ఈ వైరస్‌ వ్యాప్తి ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు సిద్ధమ య్యారు. వైరస్‌ గాలి ద్వారా ఎంత దూరం ప్రయాణించగలదు? ఎంత సమయం గాల్లో ఉండగలదు? వైరస్‌ బారిన పడ్డ వ్యక్తి నుంచి వెలువడ్డవి ఎంత సమయం ఉండగలవు? అన్న అంశాలన్నింటినీ ఈ పరిశోధనల ద్వారా తెలుసుకోనున్నారు. సుమారు పది రోజుల క్రితమే ఈ పరిశోధన మొదలైంది.

కొన్ని నెలల క్రితం కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపించగలదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఓ లేఖ రాసిన నేపథ్యంలో ఈ పరిశోధనకు ప్రాముఖ్యత ఏర్పడింది. ప్రస్తుతం తాము ఆసుపత్రి వాతావరణంలో వైరస్‌ వ్యాప్తిపై పరిశోధనలు చేస్తున్నామని, దీని ఫలితాల ఆధారంగా బ్యాంకు, షాపింగ్‌మాల్స్‌ వంటి ప్రాంతాలపై పరిశోధనలు చేపడతామని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. ఆసుపత్రి వాతావరణంలో జరిగే పరిశోధన కోసం ఐసీయూ, కోవిడ్‌ వార్డు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పరికరం సాయంతో గాలి నమూనాలు సేకరిస్తామని రోగికి రెండు నుంచి ఎనిమిది మీటర్ల దూరం నుంచి సేకరించిన నమూనాలతో పరిశోధనలు చేస్తామని వివరించారు. వైరస్‌ ఎంత దూరం ప్రయాణించగలదో నిర్వచించగలిగితే ఆరోగ్య కార్యకర్తలకు రక్షణ కల్పించే విషయంలో మార్పులు చేర్పులు చేయవచ్చునని చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా