Bipin Rawat: హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్‌ రావత్‌ దుర్మరణం

9 Dec, 2021 12:01 IST|Sakshi

బిపిన్‌ రావత్, ఆయన భార్య మధులికతోపాటు 11మంది మృతి 

కూనూర్‌: బుధవారం తమిళనాడు కూనూర్‌ సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్‌(చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) జనరల్‌ బిపిన్‌ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందారు. 2019లో ఆయన సీడీఎస్‌గా నియమితులయ్యారు. డిఫెన్స్‌ వైఫ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌(డీడబ్లు్యడబ్ల్యయే) అధ్యక్షురాలిగా మధులిక సేవలనందిస్తున్నారు. రావత్‌ మరణాన్ని భారత వైమానిక శాఖ(ఐఏఎఫ్‌) నిర్ధారించింది. పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో ఎంఐ– 17వీహెచ్‌ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైందని, దీంతో అందులో పయనిస్తున్న 13మంది మరణించారని, ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారని వైమానిక శాఖ ప్రకటించింది.

ప్రమాదంలో గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ మాత్రమే బతికి బయటపడ్డారని,  ప్రస్తుతం వెల్లింగ్టన్‌ మిలటరీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడని తెలిపింది. మరణించినవారిలో ఐదుగురు హెలికాప్టర్‌ సిబ్బంది ఉన్నారు. గురువారం ఉదయం వెల్లింగ్టన్‌లో మృతులకు నివాళి అర్పించిన అనంతరం వారి అవశేషాలను కోయంబత్తూర్‌ నుంచి ఢిల్లీకి వాయుమార్గంలో తీసుకుపోనున్నట్లు పోలీసు, రక్షణవర్గాలు తెలిపాయి. శుక్రవారం వీరికి ఢిల్లీ కంటోన్మెంట్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

‘‘ దుర్ఘటనలో రావత్, ఆయన సతీమణి మధులికా రావత్‌ సహా 11 మంది మరణించారని తెలిపేందుకు విచారిస్తున్నాం’’ అని వైమానిక శాఖ ట్వీట్‌ చేసింది. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్‌లో ప్రసంగించేందుకు రావత్‌ రావాల్సిఉంది.  ఇదే కాలేజీలో రావత్‌ గతంలో విద్యాభ్యాసం   చేశారు. చదువుకున్న చోటికి వెళ్తూ మృత్యు ఒడిలోకి రావత్‌ చేరటం విధివైపరీత్యం. ప్రమాదంలో బతికిబయటపడ్డ వరుణ్‌ సింగ్‌ ఈ కాలేజీలో డైరెక్టింగ్‌ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు.

మృతుల్లో రావత్, మధులికతో పాటు బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిడ్డర్, లెఫ్టినెంట్‌ కల్నల్‌ హర్జిందర్‌ సింగ్, వింగ్‌ కమాండర్‌ పీఎస్‌ చౌహాన్, స్క్వాడ్రన్‌ లీడర్‌ కే సింగ్, నాయక్‌ గురుసేవక్‌సింగ్, నాయక్‌ జితేందర్‌ కుమార్, లాన్స్‌నాయక్‌ వివేక్, లాన్స్‌ నాయక్‌ బీ సాయితేజ, హవల్దార్‌ సత్పాల్, జేడబ్ల్యయో దాస్, ప్రదీప్‌ ఉన్నారని అధికారులు చెప్పారు. వీరిలో సాయితేజ ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందినవారు. బిపిన్‌కు భద్రతాధికారిగా పనిచేస్తున్నారు. బిపిన్‌ మరణంతో సైనిక దళాలు తీవ్ర విచారంలో మునిగిపోయాయి.

ఆయన వ్యూహాలను, సామర్థ్యాన్ని గుర్తు చేసుకున్నాయి. 2016–2019 కాలంలో ఆయన ఆర్మీ చీఫ్‌గా పనిచేశారు. అనంతరం రక్షణబలగాల ఉమ్మడి అధిపతిగా నియమితులయ్యారు. రావత్‌ మరణంపై ఆర్మీ చీఫ్‌ నరవణె, తదితర ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. రావత్‌ నాయకత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆర్మీ ట్వీట్‌ చేసింది.  

సీసీఎస్‌ అత్యవసర సమావేశం 
రావత్‌ ప్రయాణిస్తున్న ఛాపర్‌ క్రాష్‌ అయిందన్న వార్త నేపథ్యంలో ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ(సీసీఎస్‌) సమావేశమైంది. ఇందులో ప్రధాని, రక్షణ; హోం, ఆర్థిక, విదేశాంగ మంత్రులతో పాటు కేబినెట్‌ సెక్రటరీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ పాల్గొన్నారు. సీసీఎస్‌ సభ్యులతో పాటు కేబినెట్‌ సభ్యులు రావత్‌ మరణంపై సంతాపాన్ని తెలియజేశారు. కొత్త సీడీఎస్‌గా ఎవరినైనా నియమిస్తారా? లేదా? అన్న విషయమై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.

ప్రమాద వివరాలను రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్, ప్రధాని మోదీకి వివరించారు. ఐఏఎఫ్‌ చీఫ్‌ను సంఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. తదనంతరం రాజ్‌నాధ్‌ ఢిల్లీలోని రావత్‌ నివాసానికి వెళ్లి రావత్‌ కుమార్తెను పరామర్శించారు. రావత్‌ గొప్ప సైనికుడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రావత్‌ మరణంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని ప్రకటించారు. ప్రమాద సంఘటనపై శుక్రవారం రాజ్‌నాధ్‌ పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్నారు.

 

ఇలా జరిగింది...
►ఢిల్లీ పాలం విమానాశ్రయం నుంచి రావత్‌ తదితరులు బుధవారం ఉదయం 9గంటలకు బయలుదేరారు.  
►ఉదయం 11.34 గంటలకు కోయంబత్తూర్‌ సమీపంలోని సూలూర్‌ ఎయిర్‌బేస్‌కు చేరారు. 
►11.45 గంటలకు రావత్‌ తదితరులు ప్రయాణిస్తున్న ఛాపర్‌ సూలూర్‌ ఎయిర్‌బేస్‌ నుంచి టేకాఫ్‌ అయింది. 45 నిమిషాల్లో వెల్లింగ్టన్‌లోని స్టాఫ్‌కాలేజీకి చేరాల్సిఉంది.  
►మధ్యాహ్నం సుమారు 12.20 గంటలప్రాంతంలో  ప్రమాదం జరిగినట్లు తెలియగానే ప్రమాదస్థలానికి 8 అంబులెన్సులు, వైద్య బృందాలు చేరుకున్నాయి.  
►నీలగిరి జిల్లాలోని కట్టెరి– నాన్చపంచత్రం ప్రాంతంలో ఛాపర్‌ కూలిపోయింది. స్థానికులు తొలుత ఈ ప్రమాదాన్ని గుర్తించారు.  
►పొగమంచు వాతావరణంలో ఛాపర్‌ బాగా కిందకు వచ్చిందని, కూనూర్‌ సమీపంలోని ఒక లోయలో కూలిపోయిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.  
►ఘటనా స్థలికి చేరేటప్పటికే మంటలు ఛాపర్‌ను ఆక్రమించాయని తెలిపారు.  
►కూలిపోయే సమయంలో ఒక ఇంటిని హెలికాప్టర్‌ గుద్దుకుంది. కానీ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు.  
►ఛాపర్‌ నుంచి ఇద్దరు వ్యక్తులు పడిపోయారని ప్రత్యక్ష సాక్షి పెరుమాళ్‌ చెప్పారు. ప్రమాద ప్రాంతంలోని చెట్లు ధ్వంసం అయ్యాయి.  
►ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు స్థానికులు యత్నించినా ఉపయోగం లేకపోయింది.  
►ప్రమాద స్థలంలో భారీగా మంటలు చెలరేగాయి, పరిసరాల్లోని చెట్లుచేమా తగలబడ్డాయి. వీటిని ఆర్పేందుకు అక్కడివారు యత్నించారు.  
►మంటలు అదుపులోకి వచ్చాక చూస్తే ప్రయాణీకులు మరణించినట్లు తెలిసింది.  
►గుర్తు తెలియని విధంగా దేహాలు కాలిపోవడంతో డీఎన్‌ఏ టెస్టులు నిర్వహించి మృతులను నిర్ధారించారు.  
►మధ్యాహ్నం 1.53 గంటలకు రావత్‌ మరణాన్ని ఐఏఎఫ్‌ అధికారికంగా ధృవీకరించింది.  
►సాయంత్రం 6.03 గంటలకు మరణవార్తను ఐఏఎఫ్‌ ప్రకటించింది.

 

ఉలిక్కిపడ్డ పశ్చిమ కనుమలు 
ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ రావత్‌ పయనిస్తున్న హెలికాప్టర్‌ కూలిన దుర్ఘటనతో పశ్చిమ కనుమలు ఉలిక్కిపడ్డాయి. నీలగిరి జిల్లాలోని తేయాకు తోటల్లోని కార్మికులు తొలిసారి ఈ దుర్ఘటనను గుర్తించారు. ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద ధ్వని వినిపించడాన్ని గమనించారు. చప్పుళ్లు ఏదో ప్రమాదానికి సంకేతమని గుర్తించి వెంటనే సంఘటనా స్థలాన్ని వెతుకుతూ వెళ్లారు. అప్పటికింకా ఆ ప్రాంతంలో కొంత పొగమంచు ఉంది. అక్కడకు వెళ్లాక భగభగలాడే మంటలు, లోహవస్తువులు విరిగిపోతున్న ధ్వనులను గుర్తించి నివ్వెరపోయారు. ప్రమాదం జరిగిందని స్థానికులు సాయం చేసేందుకు తయారయ్యారు. పెద్ద మంటల కారణంగా సంఘటన స్థలం దగ్గరకు పోలేకపోయారు. దాదాపు అరగంట పాటు మంటలు చెలరేగుతూనే ఉన్నాయని సాక్షులు చెప్పారు. 

దిగ్భ్రాంతికి గురి చేసింది.. 
హెలికాప్టర్‌ ప్రమాదం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. రావత్, అతని సతీమణి మధులిక మృతి దురదృష్టకరం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అందరికీ నా నివాళులు. వారి కుటుంబాలకు నా సానుభూతి.  
– ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

ఊహించని విషాదం 
హెలికాప్టర్‌ ప్రమాదం ఊహించని విషాదం. రావత్, ఆయన సతీమణితో సహా ఈ ప్రమాదంలో మరణించిన పదకొండు సైనికుల కుటుంబాలకు నా సానుభూతి. ఈ కష్టకాలంలో నా ఆలోచనలన్నీ వాళ్ల కుటుంబాలతోనే ఉంటాయి. ఈ దుఃఖ సమయంలో దేశమంతా ఐక్యతతో ఉంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నా హృదయపూర్వక నివాళులు.  
– కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ 

వారి మరణం తీరనిలోటు... 
జనరల్‌ బిపిన్‌రావత్, 11 మంది సైనికుల అకాల మరణం దేశానికి, సాయుధ బలగాలకు తీరని లోటు. ప్రమాదం తీవ్రమైన వేదనను మిగిల్చింది.  
– కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 

ఆయన మరణం బాధించింది.. 
ఇది విషాదకరమైన రోజు. బిపిన్‌ ధీర సైనికుడు. మాతృభూమికోసం ఎనలేని సేవలందించాడు. ఆయన అంకితభావం, చేసిన సేవ మాటల్లో చెప్పలేనిది. ఆయన మరణం నాకెంతో బాధను మిగిల్చింది.   
– కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా 

మాటలురావడం లేదు...  
కూనూర్‌లో జరిగిన ప్రమాదం విచారకరం. అది విని నేను షాక్‌కు గురయ్యాను. నా సంతాపాన్ని తెలపడానికి మాటలు రావడం లేదు 
– పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత

ప్రగాఢ సానుభూతి... 
భారత మొట్టమొదటి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌రావత్, ఆయన సతీమణి మధులిక, 11 మంది సైనికుల మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశానికిది తీరని లోటు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. 
– తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌.కె.స్టాలిన్‌ 

రావత్‌ మరణం తీరనిలోటు 
భారత సైన్యానికి 42 ఏళ్లపాటు సేవలందించిన బిపిన్‌ రావత్‌ మరణం దేశానికి, సైన్యానికి తీరనిలోటు. రావత్‌సతీమణి, మరో 11 మంది సైనికాధికారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. దేశ సేవలో అమరులైన వారి ఆత్మకు శాంతి కలగాలి. 
తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ 

కలచివేసింది...  
సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ మృతికి సంతాపం తెలియజేస్తున్నా. హెలికాప్టర్‌ ప్రమాదంలో రావత్‌ సహా ఆయన సతీమణి, పలువురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. దేశ రక్షణ రంగానికి రావత్‌ చేసిన సేవలు మరువలేనివి. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.  
– తెలంగాణ సీఎం కేసీఆర్‌  

గొప్ప వ్యూహకర్త... 
 బిపిన్‌ రావత్‌ గొప్ప రక్షణ వ్యూహకర్త, నిజమైన దేశభక్తుడిని దేశం కోల్పోయింది. ఆయన మృతి దేశానికి తీరనిలోటు. ఆయన నాయకత్వంలో ఇండియన్‌ ఆర్మీ ఎంతోశౌర్యపరాక్రమాలను చూపింది.
– ఆర్‌ఎస్‌ఎస్‌ 

కలచివేసింది... 
రావత్‌ మృతి కలచివేసింది. దేశానికి తీరని లోటు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయాలపాలైన వరుణ్‌ త్వరగా కోలుకోవాలి.
– ఒడిశా సీఎం  నవీన్‌  పట్నాయక్‌


చదవండి: హెలికాప్టర్‌ ప్రమాదంలో బిపిన్‌ రావత్‌ కన్నుమూత

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం
తమిళనాడు హెలికాప్టర్​ ప్రమాదంలో కన్నుమూసిన బిపిన్‌ రావత్‌ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ''జనరల్ బిపిన్ రావత్ అద్భుత సైనికుడు. నిజమైన దేశభక్తుడు. ఆయన మన సాయుధ బలగాలను, భద్రతా యంత్రాంగ ఆధునీకీకరణలో దోహదపడ్డారు. వ్యూహాత్మక విషయాలపై ఆయన ఆలోచనలు అసాధారణం. ఆయన మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఓం శాంతి’ . అని ట్వీట్‌ చేశారు.
చదవండి: Bipin Rawat: హెలికాప్టర్‌ ప్రమాద మృతుల్లో తెలుగు సైనికుడు.. 

రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ సంతాపం
జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులిక అకాల మరణం పట్ల రాష్ట్రపతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం తన ధీర కుమారుల్లో ఒకరిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభూమికి అతని నాలుగు దశాబ్దాల నిస్వార్థ సేవ అసాధారణమైన శౌర్యం, వీరత్వం గుర్తించబడిందన్నారు.  హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో మరణించిన ప్రతి ఒక్కరికి నివాళులు అర్పించడంలో తాను తోటి పౌరులతో కలుస్తానని పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు  ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 

అమిత్‌ షా నివాళి
బిపిన్‌ రావత్‌ మరణం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్​ షా విచారం వ్యక్తం చేశారు. ఇదో బాధాకరమైన రోజుగా ఆయన అభివర్ణించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతున్న.. గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
చదవండి: Bipin Rawat : హెలికాప్టర్‌ ప్రమాదం.. వైరల్‌ అవుతున్న ఫేక్‌ వీడియో

రాజ్​నాథ్​ సానుభూతి
బిపిన్ రావత్ దంపతులు, మరో 11 మంది మరణంపై రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిపిన్ మరణం.. దేశ సాయుధ దళాలకు తీరని లోటు అని ఆయన ట్వీట్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం
జనరల్ బిపిన్ రావత్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ఈప్రమాదంలో రావత్‌తో పాటు ఆయన భార్య, ఇతర ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిచి వేసిందన్నారు. దేశ రక్షణ రంగానికి బిపిన్ రావత్ చేసిన సేవలను కేసీఆర్‌ స్మరించుకున్నారు.

ఏపీ గవర్నర్ దిగ్బ్రాంతి
భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ తమిళనాడులో కుప్పకూలిన సంఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన గవర్నర్  తీవ్రంగా గాయపడిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు