అయోధ్య భూమిపూజ: రావణుని గుడిలో వేడుకలు

6 Aug, 2020 11:24 IST|Sakshi

గ్రేటర్‌ నోయిడా(ఉత్తరప్రదేశ్‌): బిస్రఖ్ గ్రామంలో రావణుడి ఆలయం వద్ద కొంతమంది భక్తులు అయోధ్య రామ మందిరానికి చెందిన భూమి పూజను జరుపుకున్నారు. పురాణాల ప్రకారం రావణుడు బిస్రఖ్ గ్రామంలో జన్మించాడని చెబుతారు. అందుకే ఈ గ్రామంలో రాక్షస రాజైన రావణుడికి ఒక ఆలయాన్ని నిర్మించారు. రామాలయ భూమి పూజ కోసం దాదాపు 200లకు పైగా ప్రదేశాల నుంచి ఆలయ నిర్మాణం కోసం మట్టిని పంపిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం కోసం ఈ రావణుడి ఆలయం నుంచి కూడా మట్టిని పంపారు. 

ఈ సందర్భంగా ఆలయ పూజారి అశోకానంద్ మహారాజ్ మాట్లాడుతూ.. ‘500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత రాములవారు తన ఇంటికి వెళ్ళబోతున్నాడు. రావణ గ్రామమైన బిస్రఖ్ నివాసులమైన మాకు ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. మా దేవుడైన రాముడు స్వదేశానికి తిరిగి రావడానికి మేము రావణుడి ఆలయంలో మతపరమైన వేడుకలు నిర్వహించాము. రాముడు లేకుండా రావణుడు అసంపూర్ణం. ఎందుకంటే రాముడే రావణుడికి మోక్షం ప్రసాదించాడు’ అని తెలిపారు. (జగమంతా రామమయం)

గ్రామవాసులు రావణుడిని ఎందుకు ఆరాధిస్తున్నారు, ఎందుకు వేడుకలు జరుపుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు అశోకానంద్ సమాధానమిస్తూ.. ‘హిందూ మతం వైవిధ్యమైనది. దేవుని పట్ల భయం హిందూ మతంలో ఒక భావన కాదు, ఇదంతా కర్మ సిద్ధాంతం. భగవంతుడు ప్రతిచోటా, అన్ని జీవులలో, ప్రాణములేని వాటిలో, మంచిలో, చెడులో, మనందరిలో ఉన్నాడు. రావణుడు శివుని భక్తుడు. ఆయన తన అధికారాలను దుర్వినియోగం చేయడం ప్రారంభించే వరకు చెడ్డ వ్యక్తి కాదు. రావణుడు చాలా శక్తిమంతుడు. తనకు మోక్షాన్ని ప్రసాదించగలిగే ఒకే ఒక వ్యక్తి రాముడని ఆయనకు తెలుసు. అందుకే రాముడితో వైరం పెట్టుకున్నాడు’ అని తెలిపారు.  

చదవండి: నూతన శకానికి నాందీ క్షణం

మరిన్ని వార్తలు