రిటర్నుల దాఖలు గడువు జనవరి 10వరకు

31 Dec, 2020 08:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మరోసారి పొడిగింపు

ఆడిట్‌ అవసరమైన వారికి ఫిబ్రవరి 15

కంపెనీలకూ ఫిబ్రవరి 15 వరకు అవకాశం

జీఎస్‌టీ వార్షిక రిటర్నుల గడువు ఫిబ్రవరి 28 

న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును మూడో విడత పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో 2019–20 ఆర్థిక సంవత్సరానికి వ్యక్తులు తమ ఆదాయపన్ను రిటర్నులను (ఆడిట్‌ అవసరం లేనివారు) జనవరి 10 వరకు ఎటువంటి ఆలస్యపు రుసుము లేకుండా దాఖలు చేసుకోవచ్చు. తమ ఖాతాలను ఆడిట్‌ చేసుకోవాల్సిన వ్యక్తులకు, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల వివరాలను రిపోర్ట్‌ చేయాల్సిన వారు.. అలాగే, ఆడిట్‌ అవసరమున్న వ్యాపార సంస్థలు, కంపెనీలకు జనవరి 31 వరకు ఉన్న రిటర్నుల గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది. ట్యాక్స్‌ ఆడిట్‌ నివేదికల సమర్పణకు జనవరి 15 వరకు తాజాగా అవకాశం కల్పించింది.(చదవండి: న్యూవిస్టాడోమ్‌ కోచ్‌తో మరుపురాని ప్రయాణం!)

ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు ఐటీఆర్‌ల దాఖలులో తగ్గుదల కనిపిస్తోంది. దీంతో మరికొంత గడువు ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక వివాద్‌ సే విశ్వాస్‌ పథకం కింద డిక్లరేషన్‌ గడువును కూడా ప్రభుత్వం జనవరి 31 వరకు పొడిగించింది. అలాగే, 2019–20 ఆర్థిక సంవత్సరపు వార్షిక జీఎస్‌టీ రిటర్నుల గడువును రెండు నెలలు అంటే ఫిబ్రవరి 28 వరకు ప్రభుత్వం పొడిగించింది. కరోనా కారణంగా ఏర్పడిన సవాళ్ల కారణంగా నిబంధనలను పాటించేందుకు ఉన్న ఇబ్బందులను దృష్టిలోకి తీసుకుని గడువును పొడిగించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది

మరిన్ని వార్తలు