విదేశీ జర్నలిస్ట్‌లు భారత్‌ రావొచ్చు: కేంద్రం

18 Aug, 2020 20:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చెల్లుబాటు అయ్యే వీసాలతో విదేశీ జర్నలిస్టులను కుటుంబ సభ్యులతో పాటు భారత్‌కు రావడానికి కేంద్రం అనుమతించింది. భారతదేశానికి రావాలనుకునే మరిన్ని వర్గాల విదేశీ పౌరులకు వీసా, ప్రయాణ ఆంక్షలను మరింత సడలించాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.దీని ప్రకారం, ఇప్పటికే భారతదేశంలోకి ప్రవేశించడానికి అనుమతి పొందిన విదేశీ పౌరులతో పాటు, జర్నలిస్ట్ (జే -1) వీసాలు కలిగి ఉన్న విదేశీ పౌరులను, జే -1 ఎక్స్ వీసాలు కలిగి ఉన్న వారిపై ఆధారపడిన వారిని భారతదేశంలోకి అనుమతించాలని నిర్ణయించినట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకవేళ ఎవరైనా సస్పెండ్ చేయబడిన జే-1 లేదా జే-1 ఎక్స్‌ వీసాలు కలిగి ఉంటే, అటువంటి వారి  వీసాలు భారతదేశంలోకి ప్రవేశించడానికి వీలుగా తక్షణమే పునరుద్ధరించబడతాయని ఆ నోటిఫికేషన్‌లో కేంద్రం పేర్కొంది. 

ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల ద్వారా భారతదేశంలోకి వచ్చే ప్రయాణీకుల రాకపోకలపై ప్రస్తుతం ఉన్న ఆంక్షలు వీరికి  వర్తించవని ప్రభుత్వం తెలిపింది. యూఎస్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ నుంచి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఒసీఐ) కార్డుదారులకు ప్రభుత్వం ఇప్పటికే భారతదేశం సందర్శించడానికి వీలు కల్పిస్తూ 'ఎయిర్ బబుల్' ఏర్పాట్లపై సంతకం చేసింది. ఈ దేశాల నుంచి వచ్చిన ఇతర విదేశీయులు కూడా వ్యాపారం, వైద్య, ఉపాధి ప్రయోజనాల కోసం భారతీయ వీసా సౌకర్యాన్ని పొందటానికి వీలు కల్పించారు. కరోనావైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో మార్చి 25 నుంచి భారతదేశానికి విదేశీయుల ప్రయాణాన్ని ప్రభుత్వం పరిమితం చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి: మహిళల వివాహ వయసు పెంపుపై కసరత్తు

మరిన్ని వార్తలు