భారత్‌నెట్‌ ప్రాజెక్టులో అందుకే జాప్యం: కేంద్రం

18 Sep, 2020 20:14 IST|Sakshi

ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానం

ప్రత్యేక రైళ్లు నడపండి

పిటిషనర్లకు పరోక్షంగా సహకరించినట్లే

రాజ్యసభలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: భారత్‌నెట్‌ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేయనున్న ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ను అండర్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి సంజయ్‌ ధోత్రే తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓవర్‌ హెడ్‌ ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ ద్వారా నెట్‌వర్క్‌ రూపొందించారని, అయితే దీని వల్ల కొన్ని సమస్యలు తలెత్తినట్లు వెల్లడించారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇకపై భూగర్బం నుంచి నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నెట్‌వర్క్‌ పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు.(చదవండి: హైకోర్టు ఉత్తర్వులు: కేంద్రం జోక్యం చేసుకోవాలి)

ఇక కోవిడ్‌ కారణంగా భారత్‌నెట్‌ తొలిదశ ప్రాజెక్టు పనుల్లో జాప్యం నెలకొందని, కాబట్టి ప్రాజెక్టు వ్యవధిని పొడగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 8 రాష్ట్రాల్లో 65 వేల గ్రామ పంచాయితీల్లో ఫైబర్‌నెట్‌ పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో గురువారం అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు రాతపూర్వక సమాధానమిచ్చారు.

ప్రత్యేక రైళ్లు నడపండి
హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం, తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపాలని ఎంపీ విజయసాయిరెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో గురువారం ఈ మేరకు ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తారు. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా రైల్వే శాఖ అంతర్‌రాష్ట్ర ప్రయాణికుల సౌకర్యార్థం 80 ప్రత్యేక రైళ్లను ప్రారంభించిందని, అయితే ఇందులో హైదరాబాద్‌- విశాఖ, హైదరాబాద్‌- తిరుపతి నగరాల మధ్య ఒక్క రైలు కూడా లేని విషయాన్ని రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణ, ఏపీల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభం కానందున ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని, రైళ్లు నడపాలని విజ్ఞప్తి చేశారు.

న్యాయ వ్యవస్థే దాడికి దిగడం అసాధారణం
అమరావతి భూ కుంభకోణం కేసులో న్యాయవ్యవస్థ తీరు గురించి విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ కేసులో ఏపీ మాజీ అడ్వకేట్‌ జనరల్‌  సహా ఇతరులపై సీఐడీ నమోదు చేసిన కేసును విచారిస్తూ, ఎఫ్‌ఐఆర్‌ వివరాలకు సంబంధించి ఎలాంటి వార్తలు, సమాచారం మీడియా, సోషల్‌ మీడియాలో ప్రచురణ కాకుండా నిషేధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సభకు తెలిపారు. కేవలం పిటిషనర్‌ ఆరోపణల ఆధారంగా కోర్టు మీడియాపై సెన్సార్‌షిప్‌ విధిస్తూ ఆదేశాలివ్వడంతో, గత ప్రభుత్వం చేసిన అక్రమాలు, తప్పులను కప్పిపుచ్చేందుకే న్యాయవ్యవస్థ ఇలా వ్యవహరిస్తుందనే భావన ప్రజల్లో బలంగా ప్రబలిపోయిందన్నారు.

ఇటువంటి అసాధారణ ఉత్వర్వుల వల్ల కోర్టు, ప్రభుత్వంపై పూర్తి వ్యతిరకతతో, పక్షపాత ధోరణితోనూ వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి బాగోతాలపై మీడియా కవరేజ్‌, పబ్లిక్‌ స్క్రూటినీ జరగకుండా పరోక్షంగా పిటిషనర్లకు సహకరించడం తప్పుడు సంకేతాలను ఇస్తోందని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు