జెండా నిబంధనల్లో మార్పులు.. ఇకపై రేయింబవళ్లు మువ్వన్నెల జెండా రెపరెపలు

23 Jul, 2022 19:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ జెండాకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లాగ్‌ కోడ్‌కు స్వల్ప మార్పులు చేసింది. ఇకపై మువ్వన్నెల జెండాను పగలే కాకుండా రాత్రివేళ కూడా ఎగురవేయవచ్చు. అలాగే కేవలం చేతితో తయారు చేసిన కాటన్ జెండాలనే కాకుండా.. మెషీన్లతో చేసే పాలిస్టర్‌ జెండాలను కూడా ఉపయోగించవచ్చు. ఈమేరకు ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్‌ టు నేషనల్‌ హానర్ యాక్ట్‌ 1971కు సవరణలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

ఇప్పటివరకు వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా జాతీయ జెండాను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే ఎగురవేసేందుకు అనుమతి ఉంది. పాలిస్టర్‌, మెషీన్లతో తయారు చేసిన జెండాలను ఉపయోగించడానికి వీల్లేదు. అయితే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమానికి పిలుపునిచ్చింది కేంద్రం. దేశంలోని ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే  ఫ్లాగ్ కోడ్‌కు మార్పులు చేసింది.
చదవండి: అందుకే నా కూతుర్ని టార్గెట్ చేశారు: స్మృతి ఇరానీ

మరిన్ని వార్తలు