తైవాన్‌ ప్రకటన; చైనాకు భారత్‌ గట్టి కౌంటర్‌

9 Oct, 2020 08:13 IST|Sakshi

న్యూఢిల్లీ: తైవాన్‌ను ఉద్దేశించి చైనా, భారత మీడియాకు రాసిన లేఖపై కేంద్రం స్పందించింది. భారత్‌లో మీడియాకు స్వేచ్ఛ ఉందని, తన దృష్టికి వచ్చిన ప్రతీ అంశాన్ని రిపోర్టు చేస్తుందంటూ డ్రాగన్‌ దేశానికి కౌంటర్‌ ఇచ్చింది. గురువారం నాటి సమావేశంలో విలేకరుల ప్రశ్నలకు బదులుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ ఈ మేరకు సమాధానమిచ్చారు. కాగా అక్టోబరు 10న జరుగనన్న తైవాన్‌ నేషనల్‌ డే ఉత్సవాలను పురస్కరించుకుని త్సాయి ఇంగ్‌- వెన్‌ ప్రభుత్వం ప్రసార మాధ్యమాల ద్వారా  ప్రకటనలు విడుదల చేసింది. ఈ క్రమంలో ఆమె ఫొటోతో పాటుగా, తైవాన్‌- భారత్‌లు సహజ మిత్రులు అన్న సందేశం కలిగి ఉన్న పత్రికా ప్రకటనలు భారత మీడియాలో ప్రచురిమతమయ్యాయి. (చదవండి: చైనా లేఖ; గెట్‌ లాస్ట్‌ అన్న తైవాన్‌!)

ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం.. తమ దేశంతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్న దేశాలన్నీ ‘‘వన్‌- చైనా’’ పాలసీకి కట్టుబడి ఉండాలని సూచిస్తూ, తైవాన్‌ ప్రకటనలను ప్రచురించడంపై అసహనం వ్యక్తం చేసింది. ప్రపంచంలో ఒకే ఒక్క చైనా ఉందని, తైవాన్‌ కూడా అందులో అంతర్భాగమని స్పష్టం చేస్తూ బుధవారం లేఖ రాసింది. తైవాన్‌ను దేశంగా, త్సాయి ఇంగ్‌ వెన్‌ను తైవాన్‌ అధ్యక్షరాలిగా పేర్కొంటూ కథనాలు రాయకూడదని విజ్ఞప్తి చేసింది. ఇక ఈ విషయంపై తైవాన్‌ కూడా కాస్త ఘాటుగానే స్పందించింది. ఇండియాలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని, కాబట్టి ఇలాంటి సెన్సార్‌షిప్‌లను ప్రజలు సహించరని చురకలు అంటించింది. ఇందుకు వారి దగ్గర ‘‘గెట్‌ లాస్ట్‌’’ అనే సమాధానం ఉంటుందంటూ డ్రాగన్‌కు కౌంటర్‌ ఇచ్చింది. (చదవండి: ‘జిన్‌పింగ్‌ను అంతగా విశ్వసించలేం’!)

ముమ్మాటికీ చైనా భూభాగమే..
ఇక చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి మరోసారి ఈ విషయంపై స్పందిస్తూ.. తైవాన్‌ ముమ్మాటికీ చైనా భూభాగమేనని గురువారం ట్వీట్‌ చేశారు. కాగా తైవాన్‌ స్వతంత్ర పాలనకు మొగ్గుచూపినప్పటికీ, డ్రాగన్‌ దేశం మాత్రం ఇందుకు అంగీకరించడం లేదన్న సంగతి తెలిసిందే. అదే విధంగా తైవాన్‌ వలె స్వేచ్ఛ కోరుకుంటున్న హాంకాంగ్‌కు స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ ఇటీవలే అక్కడ జాతీయ భద్రతా చట్టం ప్రవేశపెట్టింది. ఇక ఈ రెండు ప్రాంతాల విషయంలో చైనా వైఖరిపై అగ్రరాజ్యం అమెరికా సహా యూరప్‌ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే డ్రాగన్‌ మాత్రం తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఐక్యరాజ్యసమితి వేదికగా తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది.

ఇక భారత్‌ విషయానికొస్తే, తైవాన్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ, న్యూఢిల్లీలో తైపీ ఎకనమిక్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ ఉన్న విషయం తెలిసిందే. అంతేగాక తైపీలో ఉన్న ఇండియా- తైపీ అసోసియేషన్‌ టూరిజం, వ్యాపారం, వాణిజ్యం తదితర అంశాలను ప్రమోట్‌ చేస్తూ పలు భిన్న కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది.

>
మరిన్ని వార్తలు