ఇకపై వాహనాలకు  ఏకీకృత కాలుష్య సర్టిఫికెట్‌

18 Jun, 2021 11:04 IST|Sakshi

సర్టిఫికెట్‌పై క్యూఆర్‌ కోడ్‌

కోడ్‌లో వాహనం పూర్తి వివరాలు నిక్షిప్తం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఇకపై ఏకీకృత పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై అందజేసే పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌(పీయూసీ) సర్టిఫికెట్‌పై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రిస్తారు. ఆ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ వాహనం, వాహన యజమాని పూర్తి వివరాలు కనిపిస్తాయి. వాహనం యజమాని, అతని ఫోన్‌ నంబర్, చిరునామా, వాహన ఇంజిన్‌ నంబర్, ఛాసిస్‌ నంబర్, వాహనం కాలుష్యాన్ని ఎంత స్థాయిలో ఉద్గారాలను వెదజల్లుతోంది తదితర వివరాలన్నింటినీ పొందుపరుస్తారు.

ఇకపై వాహనం యజమాని మొబైల్‌ నంబర్‌ను తప్పనిసరి చేశారు. వ్యాలిడేషన్, చెల్లింపులు తదితరాల కోసం ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌లనూ పంపుతారు. పరిమితికి మించి అధిక ఉద్గారాలు వెలువడితే ఇకపై రిజెక్షన్‌ స్లిప్‌ను ఇవ్వనున్నారు. కేంద్ర మోటార్‌ వెహికల్‌ చట్టాలు–1989లో సవరణలు చేసి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇకపై పీయూసీ డేటాబేస్‌ను జాతీయ రిజిస్ట్రర్‌తో అనుసంధానిస్తారు.

డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్‌సీసహా ఇతర పత్రాల రెన్యువల్‌ గడువు పొడిగింపు
కోవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో వాహనాల పత్రాలను రెన్యువల్‌ చేసుకోలేని వారికి కేంద్రం మరో ఉపశమనం కల్గించింది. డ్రైవింగ్‌ లైసెన్స్, వెహికల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్‌సీ), ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌లతో పాటు అన్ని రకాల పర్మిట్ల చెల్లుబాటును కేంద్రం సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు పొడిగించింది.  గత ఏడాది ఫిబ్రవరి నుంచి గడువు ముగిసిన మోటారు వాహన డ్రైవర్లపై విచారణ చేయరాదని రాష్ట్రాల రవాణా శాఖలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ ఒక అడ్వైజరీ జారీ చేసింది.

చదవండి: దేశంలో 8 లక్షల దిగువన కరోనా పాజిటివ్‌  కేసులు  

చదవండి: వాహనదారులకు కేంద్రం శుభవార్త!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు