విగ్రహాలు తాకొద్దు.. పాటలు పాడొద్దు

7 Oct, 2020 07:46 IST|Sakshi

పండగల నేపథ్యంలో కోవిడ్‌ కట్టడిపై ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. నిత్యం వేలాదిగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రోజూ దాదాపు వెయ్యి మంది కరోనాతో కన్నుమూస్తున్నారు. రానున్న మూడు నెలలు పండుగ రోజులే. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ నెలాఖరు దాకా దేశంలో ఏదో ఒక చోట పండుగ కార్యక్రమాలు జరుగుతాయి. దసరా, దీపావళి, క్రిస్మస్‌ వంటి వేడుకల్లో జనం భారీగా పాల్గొంటారు. ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడే చోట కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అందుకే ఈసారి పండుగల విషయంలో జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కట్టడి(కంటైన్‌మెంట్‌) జోన్లలో పండుగ ఉత్సవాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అలాంటి ప్రాంతాల్లో జనం ఇళ్లకే పరిమితం కావాలని, ఇళ్లల్లోనే పండుగలు జరుపుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ప్రామాణిక నిర్వాహక విధానాన్ని(ఎస్‌ఓపీ) విడుదల చేసింది.(చదవండి: ఆరోగ్యమంత్రికి కరోనా, రాహుల్‌తో కలిసి వేదిక పంచుకున్న వైనం)

  • పండుగల్లో విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను చేతులతో తాకరాదు. 
  • భక్తి సంగీతం/పాటలు వినిపించవచ్చు. పాటల పోటీలు నిర్వహించకూడదు. బృందాలుగా పాడకూడదు. 
  • పండుగ కార్యక్రమాలు జరిగే చోట జనం భౌతిక దూరం పాటించేందుకు వీలుగా మార్కింగ్‌ చేయాలి. ఒక్కొక్కరి మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండాలి. క్యూ లైన్లలోనూ ఇదే విధానం పాటించాలి. ఇలాంటి వేడుకలు తగినంత స్థలం ఉన్నచోటే ఏర్పాటు చేసుకోవాలి. 
  • థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరిగా చేయాలి. 
  • వేడుకలే జరిగే ప్రాంగణాలను ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేయాలి.
  • భక్తులతో ర్యాలీలు, విగ్రహాల నిమజ్జనాలు జరిగేటప్పుడు పరిమితి సంఖ్యలోనే జనాన్ని అనుమతించాలి. 
  • ర్యాలీల్లో అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలి. 
  • వేడుకల ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ఒకదారి, బయటకు వెళ్లడానికి మరో దారి వేర్వేరుగా ఉండాలి. 
  • ఆలయాల్లోకి వెళ్లే భక్తులు తమ చెప్పులను వాహనాల్లోనే వదిలేయడం మంచిది. 
  • పండుగ వేడుకల ప్రాంగణాలు, ఆలయాల్లో భక్తులకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. వైద్య సదుపాయం సైతం ఉండాలి.
మరిన్ని వార్తలు