కోవిడ్‌ వ్యాక్సిన్‌: కేంద్రం కీలక ప్రకటన

24 Apr, 2021 16:49 IST|Sakshi

వ్యాక్సిన్‌ని రూ.150కే కొని రాష్ట్రాలకు అందజేస్తాం

ఆక్సిజన్ తయారుచేసే పరికరాల కస్టమ్స్‌ డ్యూటీ తొలగింపు

కోవిడ్‌ వ్యాక్సిన్‌పై మూడు నెలల పాటు కస్టమ్స్ డ్యూటీ రద్దు

న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు టీకాలను ఉచితంగా సరఫరా చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. ఉత్పత్తి సంస్థల నుంచి ఒక్కో డోస్‌ను 150 రూపాయలకు కేంద్రం కొనుగోలు చేస్తున్నట్టు ఈ మేరకు ఆరోగ్య శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ టీకాలకు రాష్ట్రాలకు అందజేస్తామని పేర్కొంది. దేశంలో కరోనా విశ్వరూపం దాల్చడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా టీకా తయారీ సంస్థల నుంచి నేరుగా రాష్ట్రాలు వ్యాక్సిన్‌లు కొనుగోలుకు అవకాశం కల్పించింది.

వ్యాక్సిన్ తయారీ సంస్థలు సగం డోసులను కేంద్రానికి, మిగిలిన డోసులను రాష్ట్ర ప్రభుత్వాలకు, ఓపెన్ మార్కెట్‌లో విక్రయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో కోవిషీల్డ్ ధరలను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఒక్కో డోస్ ధర కేంద్రానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయలు, ప్రయివేట్ ఆస్పత్రులకు 600 రూపాయలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఒకే దేశం, ఒకే పార్టీ నినాదం ఎత్తుకున్న బీజేపీ.. టీకా ధరల్లో ఎందుకంత వివక్ష చూపుతోందని ఎదురుదాడి చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేసింది. 

వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌ దాని సంబంధిత పరికరాలపై పన్ను మాఫీ
దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ సారి ఆక్సిజన్‌ వినియోగం భారీగా పెరగడంతో దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ పరిస్థితులపై ఢిల్లీ హైకోర్లు, దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న మూడు నెలల పాటు కోవిడ్‌ వ్యాక్సిన్‌ల దిగుమతిపై కస్టమ్స్‌ డ్యూటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలానే ఆక్సిజన్ తయారు చేసే పరికరాలపై కస్టమ్స్‌ డ్యూటీ, హెల్త్‌ సెస్‌ను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
 

కోవిడ్‌ కేసులు పెరుగుతుండటం.. ఆక్సిజన్‌ కొరతపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. ఆక్సిజన్‌ సరఫరాను మెరుగు పర్చడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆక్సిజన్‌, దాని సంబంధిత పరికరాలు, కోవిడ్‌ వ్యాక్సిన్‌లపై కస్టమ్స్‌ పన్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మోదీ ట్వీట్‌ చేశారు. 

చదవండి: కరోనా సెకండ్‌వేవ్‌: ప్రజలకు కేంద్రం తీపికబురు! 

మరిన్ని వార్తలు