కాళేశ్వరం ప్రాజెక్ట్‌ డేటా ఇస్తారా? లేదా?

28 Oct, 2023 08:54 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ డేటా కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్‌ డ్యామ్‌ సేఫ్‌ అథారిటీ లేఖ రాసింది. రేపటిలోగా(ఆదివారం) ప్రాజెక్ట్‌కు సంబంధించి సమాచారం ఇవ్వాలని డెడ్‌లైన్‌ విధించింది. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమాచారంలేదని భావిస్తామని లేఖలో పేర్కొంది. 

వివరాల ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్టు డేటా కేంద్రానికి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి 20 రకాల సమాచారాన్ని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగింది. కాగా, ఇప్పటివరకు నాలుగు అంశాలపై మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. మిగితా 16 అంశాలపై తెలంగాణ ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు. అయితే, ప్రాజెక్టు క్వాలిటీ,  జియలాజికల్ స్టడీ , కాంట్రాక్టర్ లయబిలిటీ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు. దీంతో, ఈ విషయాన్ని డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సీరియస్‌గా తీసుకుంది. 

డెడ్‌లైన్‌ విధింపు..
రేపటిలోగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ.. రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించింది. అయినప్పటికీ సమాచారం ఇవ్వని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని తాము భావిస్తామని తెలిపింది. ఈ క్రమంలో డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

బ్యారేజీల్లో సమస్యలు సహజమే..
మరోవైపు.. ఇసుకపై పునాదులు వేసి కట్టే బ్యారేజీల్లో సమస్యలు సహజమేనని, మేడిగడ్డ బ్యారేజీ డిజైన్, నిర్మాణంలో సమస్యల్లేవని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. బ్యారేజీ డిజైన్‌లో లోపాలుంటే ఎప్పుడో కొట్టుకుపోయేదన్నారు. గతంలో ఫరక్కా, ధవళేశ్వరం బ్యారేజీల్లోనూ సమస్యలు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మోనోలిథిక్‌ డిజైన్‌తో బ్యారేజీ నిర్మించారని, గతేడాది భారీ వరదలను కూడా బ్యారేజీ తట్టుకుందన్నారు.

బ్యారేజీ మొత్తం ఎనిమిది బ్లాకులతో నిర్మిస్తే అందులో 7వ బ్లాకులోని పియర్‌ నంబర్‌ 16, 17, 18, 19, 20, 21లలో సమస్యలు ఉత్పన్నం అయ్యాయన్నారు. తొలుత కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి ఎగువ ప్రాంతాల నుంచి వరదను మళ్లిస్తామని... ఆ తర్వాత చుట్టూ రింగ్‌ మెయిన్‌ నిర్మించి పియర్ల కుంగుబాటుకు గల కారణాలను గుర్తించాకే మరమ్మతు పనులు ప్రారంభిస్తామని ఆయన వివరించారు. బ్యారేజీ నిర్మాణం రివర్‌బెడ్‌పై జరగడం, ఇసుకపైనే పునాదులు ఉండటం వల్ల సమస్యలు వస్తాయన్నారు. పిలర్ల కింద ఇసుక కదలడం వల్లే కుంగినట్లు చెప్పారు. మరమ్మతులకు సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ అనుమతించాలని తెలిపారు. జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కోరిన వివరాలను సమర్పించినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో అగ్రవర్ణాలకు పెద్దపీట

మరిన్ని వార్తలు