టీకా ఉత్పత్తి: ఇతర కంపెనీలకు కోవాగ్జిన్‌ ఫార్ములా!

13 May, 2021 17:34 IST|Sakshi

టీకా ఉత్పత్తి వేగవంతం చేయడం కోసం కేంద్రం కసరత్తు

దీని గురించి గతంలోనే మోదీకి సీఎం జగన్‌ లేఖ

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించాలని భావించినప్పటికి టీకాల కొరత వల్ల పలు రాష్ట్రాల్లో అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది.కోవాగ్జిన్‌ ఫార్ములాను మరికొన్ని కంపెనీలకు ఇవ్వడానికి కేంద్రం అంగీకారం తెలిపింది. 

కోవాగ్జిన్‌ ఫార్ములా, టెక్నాలజీ బదిలీని ఇతర కంపెనీలకు ఇవ్వాలని గతంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈనెల 11న సీఎం జగన్‌, ప్రధాని మోదీకి లేఖ రాశారు. భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు... టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని లేఖలో తెలిపారు. ఇతర వ్యాక్సిన్‌ ఉత్పత్తి కంపెనీలకు టెక్నాలజీని అందించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు. ఫలితంగా తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయొచ్చని సీఎం జగన్‌ లేఖలో సూచించారు. 

చదవండి: పిల్లలపై వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు డీసీజీఐ ఆమోదం
ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ

>
మరిన్ని వార్తలు