కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం

7 Jun, 2021 17:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్‌ బాధ్యత ఇకపై పూర్తిగా కేంద్రానిదేనని, కేంద్రమే పూర్తిగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకు సంబంధించి కొత్త గైడ్‌లైన్స్‌ ఇస్తామని చెప్పారు. సోమవారం సాయంత్రం సెకండ్‌ వేవ్‌ తర్వాత మొదటి సారి ఆయన జాతినుద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై కీలక ప్రకటన చేశారు. జూన్‌ 21 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్లు వేస్తామని అన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రూ.150 మాత్రమే సర్వీస్‌ ఛార్జీ తీసుకోవాలని ఆదేశించారు. కరోనాతో యుద్ధంలో భారత్ గెలుస్తుందని, నవంబర్‌ నాటికి 80 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని చెప్పారు.

దీపావళి వరకు పీఎం గరీభ్‌ కళ్యాణ్‌ అన్నదాన యోజన పథకం కొనసాగుతుందని, పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఎవరూ ఆకలితో బాధపడొద్దనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్లకు సంబంధించి కొందరు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని, ఇలాంటి వారందరినీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

చదవండి : ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత ఘోరమైన విషాదం: మోదీ 

మరిన్ని వార్తలు