ప్రియాంక వీడియో: క్లారిటీ ఇచ్చిన కేంద్రం

16 Dec, 2020 16:15 IST|Sakshi
రైలుపై అదానీ విల్‌మార్‌ స్టాంప్‌

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా షేర్‌ చేసిన రైల్వే వీడియోపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇండియన్‌ రైల్వేకు చెందిన ఓ రైలుపై అదానీ గ్రూపుకు చెందిన స్టాంప్‌ ఉండటంపై వివరణ ఇచ్చింది. ‘‘ భారత ప్రభుత్వం ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన స్టాంపును ఇండియన్‌ రైల్వేకు చెందిన ఓ రైలుపై అంటించిందన్న వాదన తప్పుదారి పట్టించేదిలా ఉంది. ఆ స్టాంప్‌ రైల్వే శాఖ ఆదాయం పెంచడానికి వేసిన వ్యాపార ప్రకటన మాత్రమే’’ అని ప్రెస్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ బ్యూరో(పీఐబి) పేర్కొంది. కాగా, ప్రియాంక గాంధీ ఈ నెల 14న ఈ వీడియోను తన వ్యక్తిగత ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

‘‘భారత ప్రజల కష్టంతో నిర్మించబడ్డ ఇండియన్‌ రైల్వేలపై ప్రధాని మోదీ తన డబ్బున్న మిత్రుడు అదానీ స్టాంపులు వేస్తున్నారు. రేపటి రోజు ఇండియన్‌ రైల్వేలోని అధిక భాగం మోదీ డబ్బున్న స్నేహితులకు వెళ్లిపోతుంది. తాము మోదీ మిత్రుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు దేశ రైతులు వ్యవసాయాన్ని మానుకుని మరీ పోరాడుతున్నారు’’ అని ఆమె పేర్కొన్నారు. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియో పది వేల లైకులతో, దాదాపు 7 వేల షేర్లతో వైరల్‌గా మారింది. 

మరిన్ని వార్తలు