వందేళ్ల తర్వాత కాశీ విశ్వనాథుడికి చెంతకు అన్నపూర్ణ

11 Nov, 2021 21:29 IST|Sakshi

న్యూఢిల్లీ: దశాబ్దాల కిత్రం వారణాసి నుంచి దొంగిలించబడిన అన్నపూర్ణ దేవి చారిత్రాత్మక విగ్రహాన్ని కెనడా నుంచి భారత ప్రభుత్వం స్వదేహానికి తీసుకొచ్చింది. వందేళ్ల క్రితం చోరికి గురైన ఈ విగ్రహాన్ని కెనడాలో గుర్తించారు. కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన కేంద్రం.. చివరకు అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని తిరిగి వెనక్కి రప్పింది. 18వ శతాబ్దానికి చెందిన ఈ అన్నపూర్ణ దేవి విగ్రహం గురువారం భారత్‌ చేరుకుంది. ఈ విగ్రహానికి ఢిల్లీలోని నేషనల్‌ గ్యాలరీఆఫ్‌ మోడరన్‌ ఆర్ట్‌లో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. 

అనంతరం అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వానికి అప్పగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. భారత సంస్కృతికి చెందిన విగ్రహాలు వివిధ దేశాల్లో ఉన్నాయని, వాటిని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.  అన్నపూర్ణ దేవి మూర్తి విగ్రహం ఇప్పుడు సరైన చోటులో ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని ఊరేగింపుగా యూపీలోని కాశీ విశ్వనాథ ఆలయానికి తీసుకువెళ్లి అక్కడ పున:ప్రతిష్ట నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కాశీ విశ్వనాథుని ఆలయంలో భక్తులు ఇకనుంచి అన్నపూర్ణ దేవి కృపను, ఆశీర్వచనాన్ని కూడా పొందవచ్చని కిషన్ రెడ్డి తెలిపారు.

ఢిల్లీకి చేరుకున్న అన్నపూర్ణ దేవి  విగ్రహాన్ని అలీగఢ్ తీసుకెళ్లి, అక్కడి నుంచి నవంబర్ 12న కనౌజ్ తీసుకెళ్లనున్నారు. అనంతరం  నవంబర్ 14న అయోధ్య.. అటు నుంచి వారణాసికి తీసుకెళ్లి చివరగా నవంబర్‌ 15న కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రతిష్టించనున్నారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్‌ చేతుల మీదుగా ఈ విగ్రహ అవిష్కరణ చేయనున్నారు. ఈ విగ్రహం 17 మీటర్లు ఎత్తు, 9 సెంటీమీటర్లు వెడల్పు, 4 సెంటీమీటర్ల మందం కలిగి ఉంది.
 

మరిన్ని వార్తలు