షెడ్యూల్‌ ప్రకారమే నీట్, జేఈఈ 

22 Aug, 2020 07:46 IST|Sakshi

న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(ఎన్‌ఈఈటీ–నీట్‌), సంయుక్త ప్రవేశ పరీక్ష (జేఈఈ) ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరోనా కారణంగా పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్థుల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో వీటి నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే జేఈ ఈ అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జారీ చేసింది. ఈ పరీక్షకు దాదాపు 8.6 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 6.5 లక్షల మంది అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. జేఈఈ మెయిన్‌ ఎగ్జామ్‌ సెప్టెంబర్‌ 1 నుంచి 6 తేదీల్లో, జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష సెప్టెంబర్‌ 27న, నీట్‌ పరీక్ష సెప్టెంబర్‌ 13న జరగనుంది.

నీట్‌కు సుమారు 16 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా సంక్షోభ నేపథ్యంలో కేంద్ర గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా పరీక్షా కేంద్రాల్లో శానిటైజేషన్‌ ఏర్పాట్లను చేయనున్నారు. ప్రతి విద్యార్థికి తాజా మాస్కులు, గ్లౌవ్స్‌ను అందిస్తారు. కరోనా నేపథ్యంలో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారు పరీక్షా కేంద్రం, పరీక్ష నిర్వహణ నగరం మార్పును కోరే అవకాశాన్ని, అదికూడా ఐదుసార్లు మార్చుకునే వెసులుబాటును ఎన్‌టీఏ కల్పించింది. కాగా జేఈఈకి దరఖాస్తు చేసుకున్న వారిలో 120 మంది, నీట్‌ అభ్యర్థుల్లో 95వేల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.  

>
మరిన్ని వార్తలు