నాసల్‌ వ్యాక్సిన్‌ రెండోదశ ట్రయల్స్‌కు కేంద్రం అనుమతి

13 Aug, 2021 19:47 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ బయెటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్‌ రెండోదశ ట్రయల్స్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. ముక్కు ద్వారా వేసే కోవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు కేంద్రం అనుమతి  జారీ చేసింది. కాగా మొదటి దశ క్లినికల్ ట్రయల్ 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో పూర్తయింది. 2/3 దశల పరీక్షలకు రెగ్యులేటరీ ఆమోదం పొందిన మొట్టమొదటి వ్యాక్సిన్‌ భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్(నాసికా టీకా) అని డీబీటీ తెలిపింది.

అందుబాటులో ఐదు టీకాలు..
దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లతో టీకా కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. అయితే కొంత కాలం తరువాత రష్యా తయారు చేసిన స్పుత్నిక్‌–వీ వినియోగానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. అయితే స్థానికంగా తయారీలో కొన్ని సమస్యలు ఎదురు కావడంతో వీటిని రష్యా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇది జాప్యానికి దారితీసింది. తాజా సమాచారం ప్రకారం స్పుత్నిక్‌–వీ స్థానిక ఉత్పత్తి వచ్చే నెలకు గానీ ప్రారంభమయ్యే అవకాశం లేదు. రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం మోడెర్నా వ్యాక్సిన్‌ అత్యవసర వాడకానికి అనుమతులు జారీ చేసినా... న్యాయపరమైన రక్షణ కల్పించాలన్న కంపెనీ డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఇప్పటివరకూ ఒక్క టీకా కూడా పడలేదు.  తాజాగా అమెరికన్‌ కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాకూ (సింగిల్‌ డోస్‌) ప్రభుత్వం అనుమతిచ్చింది. 

కానీ.. ఈ టీకాల వాడకం ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఇదిలా ఉండగా.. జైడస్‌ క్యాడిల్లా జైకోవ్‌–డీ టీకాతోపాటు భారత్‌లో తయారైన మొట్టమొదటి ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సీన్‌ ‘హెచ్‌జీసీఓ19’, భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న నాసల్‌ వ్యాక్సిన్‌లు మానవ ప్రయోగాల దశలో ఉన్నాయి. ఇవే కాకుండా... అమెరికన్‌ కంపెనీ తయారు చేస్తున్న నోవావ్యాక్స్‌ టీకాను భారత్‌లో కోవావ్యాక్స్‌ పేరుతో తయారు చేసేందుకు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆగస్టు – డిసెంబర్‌ మధ్యకాలంలో దేశంలో పంపిణీ అయ్యే టీకాల జాబితాలో కోవావ్యాక్స్‌ను కూడా చేర్చడాన్ని బట్టి చూస్తే దీనికి త్వరలోనే అత్యవసర అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యం అమోరికా, ఇతర జీ7 సభ్యదేశాలు ఇస్తామన్న టీకాలు న్యాయపరమైన చిక్కుల కారణంగా ఇప్పటికీ అందలేదు.
 

మరిన్ని వార్తలు