‘కోరల’తో వస్తోన్న ‘కాలుష్య–కమిషన్‌’

30 Oct, 2020 18:43 IST|Sakshi
ప్రతీకా​త్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : ఓ పక్క ప్రాణాంతక కరోనా వైరస్‌ మరో పక్క అంతకన్నా ప్రాణాంతక కాలుష్యం దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న విషయం తెల్సిందే. దేశంలో కాలుష్య నియంత్రణ కోసం 22 ఏళ్ల క్రితం ఏర్పాటై నేటికీ నిద్రావస్థలో జోగుతున్న ‘ఎన్విరాన్‌మెంటల్‌ పొల్యూషన్‌ (ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌) అథారిటి’ స్థానంలో ‘కమిషన్‌ ఫర్‌ ఏర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌’ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు ఓ ఆర్డినెన్స్‌ను తీసుకురావడం ముదావహమే! ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పంట దుబ్బలను తగులబెట్టడం వల్ల ఏర్పడుతోన్న కాలుష్యాన్ని అంచనా వేసి, దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలేమిటో సూచించేందుకు రిటైర్డ్‌ జడ్జి మదన్‌ లోకూర్‌తో ఏకసభ్య కమిషన్‌ను సుప్రీం కోర్టు అక్టోబర్‌ 16వ తేదీన ఏర్పాటు చేయడం, కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకరావడానికి హేతువు కావచ్చు! చదవండి: ఐదేళ్ల జైలు.. కోటి జరిమానా

శాశ్వత చర్యలకు శ్రీకారం చుట్టలేదు
ఢిల్లీ సహా దేశంలో పలు నగరాల్లో కాలుష్యం నివారణకు గత కొన్నేళ్లుగా స్పందిస్తున్నది, చర్యలు తీసుకుంటున్నది సుప్రీం కోర్టు ఒక్కటే. దీపావళి పండుగకే కాకుండా పెళ్లిళ్లకు, ప్రారంభోత్సవాలకు బాణాసంచాను నియంత్రిస్తూ వస్తున్నది కూడా సుప్రీం కోర్టే. కాలుష్యం సమస్య ముందుకొచ్చినప్పుడల్లా ‘సుప్రీం కోర్టు చూసుకుంటుందిలే, మనకెందుకు?’ అన్నట్లు రాజకీయ, అధికార యంత్రాంగాలు ముసుగు తన్ని నిద్రపోతూ వచ్చాయి. కేంద్రానికి హఠాత్తుగా ఎందుకు కనువిప్పు కలిగిందేమోగానీ దేశంలో కాలుష్యాన్ని నియత్రించేందుకు 18 మంది సభ్యులగల కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ హఠాత్తుగా ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. చదవండి: ఎట్టకేలకు కాలుష్యంపై చట్టం

వారికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష
ఈ కమిషన్‌కు చైర్‌పర్సన్‌ను కేంద్రం నియమిస్తుండగా, సభ్యులను నలుగురు కేంద్ర మంత్రులు, ఓ క్యాబినెట్‌ కార్యదర్శితో కూడిన నియామక కమిటీ నియమిస్తుంది. కమిషన్‌ నియామకానికి సంబంధించి విడుదల చేసిన గెజిట్‌లో అయిదు అధ్యాయాలు, 26 సెక్షన్లు ఉన్నాయి. ఈ కమిషన్‌ ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తుందని అందులో పేర్కొన్నారు. అంటే వివరణ లేదు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం లేకుండా స్వతంత్య్రంగా వ్యవహరిస్తుందని చెప్పడం కావచ్చు. కాలుష్యానికి కారణం అవుతున్న వారికి లేదా కాలుష్య చట్టాలను ఉల్లంఘించిన వారికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధించే నిబంధనలు ఇందులో ఉండడం ఎంతైనా అవసరమే. ఈ కమిషన్‌ను దేశ రాజధాని ప్రాంతంతోపాటు ఇరుగు పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేశారు. ఆ ప్రాంతాల్లోనే కాలుష్యం ఎక్కువగా ఉన్నందున తొలి ప్రాథమ్యం కింద వాటికే పరిమితం చేసి ఉండవచ్చు.

ఆ ప్రాంతాల్లోని కాలుష్యాన్ని నిర్మూలించాక, యావత్‌ దేశంలోని కాలుష్యాన్ని కూడా ఆ కమిషన్‌ రాష్ట్రాల సహకారంతో నిర్మూలించాలి. ఆ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాలను అమలు చేసి చూపాలి. కాలుష్య నిర్మూలన కమిషన్‌కు సంబంధించి అంతా బాగుందిగానీ, ఇన్నేళ్లు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోని కేంద్రం, పార్లమెంట్‌లో బిల్లుపెట్టి సమగ్ర చర్చ జరపకుండా ‘వాయు మేఘాల’ మీద ఆర్డినెన్స్‌ను తీసుకురావాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఇందులో ఏమైనా మతలబు ఉందా ? కాలుష్యం నివారణకు మెక్సికో, లాస్‌ ఏంజెలెస్, లండన్, బీజింగ్‌ ప్రభుత్వాలు కూడా ప్రమాద ఘంటికలు మోగాకే స్పందించాయి. కాలుష్యమే విషం కనుక ‘ఆలస్యం అమృతం విషం’ అనడం చెల్లకపోవచ్చు!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా