దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ

10 Mar, 2021 17:19 IST|Sakshi

దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరించాలని కేంద్రం యోచిస్తున్నట్లు హిందుస్తాన్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆ రైల్వే స్టేషన్లలో ఎయిర్‌పోర్టు తరహా భద్రతా, మౌలిక సదుపాయాలను అందించాలని భారతీయ రైల్వే ఆలోచన చేస్తోంది. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగిన భారతీయ రైల్వే, 2019లో ప్రైవేట్-కంపెనీలను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య(పిపిపి) కింద కొన్ని స్టేషన్లను నడుపుటకు అనుమతి ఇచ్చింది. ఇప్పడు మరికొన్ని రైల్వే స్టేషన్లలో మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు, భద్రతాపరమైన వసతులు కల్పించేందుకు చూస్తుంది. ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఐఆర్ఎస్ డిసి) ఆ రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ భాద్యతలను పర్యవేక్షిస్తుంది. 

ఈ 90 రైల్వే స్టేషన్లలో భద్రతా, మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలనే దానిపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పిఎఫ్), అన్ని రైల్వే జోన్ల ప్రధాన చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ల నుంచి అభిప్రాయాలను కోరుతూ రైల్వే బోర్డు లేఖ రాసింది. ప్రస్తుతం విమానాశ్రయాలలో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సిఐఎస్ఎఫ్) మాదిరిగానే ఈ స్టేషన్లలో అలాంటి భద్రతా బలగాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని రైల్వే బోర్డు తన అభిప్రాయాన్ని తెలిపింది. అలాగే, ప్రైవేట్ సంస్థలే సీఐఎస్ఎఫ్ బలగాలకు వేతనాలు చెల్లించాలి. ప్రస్తుతం విమానాశ్రయాలలో ఉన్న భద్రతాపరమైన వ్యవస్థను ప్రైవేట్ స్టేషన్లలో అమలు చేయాలనీ బోర్డు చూస్తుంది. ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను మార్చి 15లోగా తెలపాలంటూ రైల్వే బోర్డు కోరింది.

150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం కోసం బ్లూప్రింట్ రూపొందించడానికి ఒక కమిటీని 2019 అక్టోబర్‌లో ఏర్పాటు చేసింది. నాగ్‌పూర్, గ్వాలియర్, అమృత్ సర్, సబర్మతి, నెల్లూరు, పుదుచ్చేరి, డెహ్రాడూన్, తిరుపతి రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం బిడ్డింగ్ అర్హత ప్రక్రియను సెప్టెంబర్‌లో ప్రారంభించినట్లు గతేడాది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే గాంధీనగర్, హబీబ్‌గంజ్ వంటి స్టేషన్లలో పునరాభివృద్ధిపై పనులు ప్రారంభమయ్యాయి. ఆనంద్ విహార్, బిజ్వాసన్, చండీగఢ్ వంటి రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధికి కాంట్రాక్టులు ఇచ్చారు. రైల్వే పునరాభివృద్ధి చేస్తున్న స్టేషన్లలో రైలు ఛార్జీలపై అదనపు రుసుము వసూలు చేయాలనీ చూస్తుంది. ఇంకోవైపు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదట 12 ప్రైవేట్ రైళ్లు, 2027 నాటికి 151 రైళ్లను ప్రైవేటీకరించాలని కేంద్రం యోచిస్తుంది.

చదవండి:

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్!

మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు