దేశానికంతా టీకా అక్కర్లేదు

2 Dec, 2020 05:26 IST|Sakshi

కరోనా చైన్‌ బ్రేక్‌ చేసేంత మందికి ఇస్తే సరిపోతుంది: కేంద్రం

ఆక్స్‌ఫర్డ్‌ ప్రయోగాలను ఆపాల్సిన అవసరం లేదు  

న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేసేందుకు దేశంలోని అందరికీ వ్యాక్సినేషన్‌ చేయాల్సిన అవసరం లేదని, అవసరమైనంత మందికి వ్యాక్సిన్‌ ఇస్తే సరిపోతుందని కేంద్రం స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ ప్రధాన లక్ష్యం వైరస్‌ చైన్‌ను తెగ్గొట్టడమేనని, దాన్ని సాధించేందుకు దేశంలోని అందరికీ వ్యాక్సినేషన్‌ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ప్రతీఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని పేర్కొంది. వ్యాక్సినేషన్‌ చేసేందుకు దేశంలో కొందరిని జాబితా నుంచి తొలగించారని వదంతులు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరాం భార్గవతో కలసి మీడియాతో మాట్లాడారు.

అవసరమైనంత మందికి వ్యాక్సిన్‌ ఇచ్చాక.. ఇక అందరికీ వ్యాక్సినేషన్‌ చేయాల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేశారు. ఇలాంటి సాంకేతికపరమైన అంశాల్లో వాస్తవాలను ఆధారంగా చేసుకొని చర్చలు జరగాల్సి ఉంటుందన్నారు. జనాభాలో కొద్ది మందికే టీకా ప్రారంభిస్తామని, అందుకే కరోనా నుంచి రక్షించుకోవడానికి మాస్‌్కలను కవచంగా వాడాలని బలరాం భార్గవ అన్నారు. వ్యాక్సిన్‌లపై వచ్చే అసత్య వార్తలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మీడియా, వ్యాక్సిన్‌ తయారీదారుపై కూడా ఉందని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ భద్రతపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలను వెల్లడిస్తుందని చెప్పారు.  

నిర్ణీత వ్యవధిలోనే ప్రయోగాలు పూర్తి 
చెన్నై వాలంటీర్‌పై ఆక్స్‌ఫర్డ్‌ టీకా దుష్ప్రభావం కలిగించిందన్న ఆరోపణలతో, ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలను నిలిపివేయాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయంపై డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సీరం ఇనిస్టిట్యూట్‌పై వచ్చిన ఆరోపణల కారణంగా టీకా అభివృద్ధి ప్రక్రియలో ఎటువంటి మార్పులు ఉండబోవని, నిర్ణీత కాలవ్యవధిలోనే ప్రయోగాలు పూర్తి అవుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు.  వాస్తవాల ఆధారంగా దుష్పరిణామాలను పరిశీలిస్తారని,  ట్రయల్స్‌ ఆపాల్సిన అవసరంలేదని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రొఫెసర్‌ బలరాం భార్గవ అన్నారు. 

ఆయన ఉద్యోగం పోయింది: వలంటీర్‌ భార్య 
వ్యాక్సిన్‌ ప్రయోగాల కారణంగా తన భర్త (40)చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నారని, అమెరికన్‌ కంపెనీలో ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడని వ్యాక్సిన్‌ తీసుకున్న చెన్నై వలంటీర్‌ భార్య తెలిపారు. వ్యాక్సిన్‌ వల్ల  అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆన్‌లైన్‌ బ్యాంకు ట్రాన్స్‌ఫర్‌లు కూడా చేసుకోలేకపోతున్నారని, ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలకు  వలంటీర్‌గా ముందుకొచ్చిన ఆ  మార్కెటింగ్‌ ప్రొఫెషనల్‌కు అక్టోబర్‌ 1న వ్యాక్సిన్‌ డోస్‌ ఇచ్చారు. 

టీకా అత్యంత సురక్షితం: సీరం  
ఆ్రస్టాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి పరుస్తున్న కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ప్రయోగం కారణంగా వలంటీర్‌కి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయన్న ఆరోపణలను ప్రపంచ వ్యాక్సిన్‌ తయారీ దిగ్గజ కంపెనీ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తిరస్కరించింది. వ్యాక్సిన్‌ అత్యంత సురక్షితమైందని, రోగనిరోధకత పెంపొందిస్తుందని స్పష్టం చేసింది. సురక్షితమైందని తేలితే తప్ప టీకాను ప్రజల ఉపయోగం కోసం విడుదల చేయమని కంపెనీ తన బ్లాగ్‌లో తేల్చి చెప్పింది.     

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు