హస్తకళాకారులకు జాతీయ అవార్డులు

29 Nov, 2022 01:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ హస్త కళలు, టైక్స్‌టైల్స్‌ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వారికి కేంద్రం అవార్డులు అందజేసింది. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందజేసినట్లు టెక్స్‌టైల్స్‌ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 2017, 2018, 2019లో జాతీయ అవార్డులకు మొత్తం 78 మంది హస్త కళాకారులను ఎంపిక చేసినట్లు పేర్కొంది. 2018కి తెలంగాణ నుంచి  కరీంనగర్‌కు చెందిన గద్దె అశోక్‌కుమార్‌ (సిల్వర్‌ ఫిలిగ్రీ)కి అందజేసినట్లు తెలిపింది.

ఏపీ నుంచి అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన దాలవాయి కుళాయప్ప (లెదర్‌ పప్పెట్రీ, 2017), డి.శివమ్మ (లెదర్‌ పప్పెట్రీ, 2019)లకు అవార్డు అందజేసినట్లు పేర్కొంది. అవార్డు గ్రహీతలకు రూ.లక్ష నగదు, తామ్రపత్రం, శాలువా, ధ్రువపత్రం అందజేసినట్లు తెలిపింది. అలాగే, 2017, 2018, 2019 సంవత్సరాలకు మొత్తం 30 మంది శిల్పగురులను ఎంపిక చేయగా ఏపీ నుంచి బ్లాక్‌ మేకింగ్‌లో కొండ్ర గంగాధర్‌ (2018), కలంకారిలో వేలాయుధం శ్రీనివాసులు రెడ్డి (2019)ను ఎంపిక చేసినట్లు తెలిపింది. వీరికి బంగారు నాణెం, రూ.2 లక్షల నగదు, తామ్రపత్రం, శాలువా, ప్రశంసాపత్రం అందజేసినట్లు తెలిపింది. 

పీయూష్‌ గోయల్‌ నుంచి అవార్డు 
అందుకుంటున్న గద్దె అశోక్‌కుమార్‌ 

మరిన్ని వార్తలు