ఆరోగ్య కార్యకర్తలకు భద్రత కల్పించండి 

19 Jun, 2021 08:29 IST|Sakshi

అంటువ్యాధుల చట్టాన్ని(సవరణ) కఠినంగా అమలు చేయండి

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచన 

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడిలో కీలకంగా పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తల భద్రత, సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. అంటువ్యాధుల చట్టాన్ని(సవరణ) కఠినంగా అమలు చేయాలని పేర్కొంది. కరోనా కాలంలో ప్రజారోగ్య పరిరక్షణలో హెల్త్‌కేర్‌ వర్కర్స్‌ పాత్ర విస్మరించలేనిదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రెటరీ లవ్‌ అగర్వాల్‌ ప్రశంసించారు. వారి భద్రత, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అదనపు చీఫ్‌ సెక్రెటరీలకు, ప్రిన్సిపల్‌ సెక్రెటరీలకు, హెల్త్‌ సెక్రెటరీలకు లేఖ రాశారు. కొన్ని ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలపై దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోందని, ఇది చాలా బాధాకరమని అన్నారు.

పనిచేసే చోట, నివాసం ఉండే చోట వారికి పూర్తి భద్రత కల్పించాలని కోరారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలో ఇటీవల వైద్యులు, నర్సులపై భౌతిక దాడులు జరిగాయని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి పరిణామాలు ఆరోగ్య కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలపై దాడికి దిగేవారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసు పెట్టాలంటూ అంటువ్యాధుల చట్టం–1897లో సవరణ చేస్తూ గత ఏడాది ఏప్రిల్‌ 22న ఆర్డినెన్స్‌ తీసుకొచ్చామని, దీన్ని ఒక చట్టంగా సెప్టెంబర్‌ 29న నోటిఫై చేశామని లవ్‌ అగర్వాల్‌ గుర్తుచేశారు. ఈ చట్టం కింద హెల్త్‌ కేర్‌ సిబ్బందికి, వారి ఆస్తులకు రక్షణ కల్పించాల్సి ఉంటుందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తారని పేర్కొన్నారు.

చదవండి: సీఎం కుమారుడిపై  చర్యలు తీసుకోండి   

>
మరిన్ని వార్తలు