8న సినీ ప్ర‌ముఖుల‌తో కేంద్రం భేటీ‌

5 Sep, 2020 20:47 IST|Sakshi

న్యూఢిల్లీ : క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసి ఆన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభం కావ‌డంతో దేశంలోని అన్ని రంగాలు మెల్ల‌మెల్ల‌గా పునఃప్రారంభం అవుతున్నాయి. జిమ్ములు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌, ప్రార్థ‌న మందిరాలు ఇప్ప‌టికే తెరుచుకోగా మెట్రో స‌ర్వీసులు మ‌రి కొన్నిరోజుల్లో మొద‌లు కానున్నాయి. అయితే  కేవ‌లం విద్యా సంస్థ‌లు, పార్కులు, సినిమా థియేట‌ర్లు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు ప్రారంభానికి నోచుకోలేదు. ప్ర‌స్తుతం అన్‌లాక్ 4.0లో భాగంగా దేశంలో థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.  (సినిమాను కాపాడండి)

ఈ క్ర‌మంలో సినిమా థియేటర్లు మల్టీప్లెక్స్‌ల‌ ప్రారంభంపై ఈ నెల 8న సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులతో కేంద్ర హోం శాఖ అధికారులు భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న  ఈ సమావేశంలో థియేటర్లు తెరుచుకునే తేదీ, పాటించాల్సిన నిబంధ‌న‌ల‌పై చ‌ర్చించ‌నుంది. ఈ స‌మావేశం అనంత‌రం థియేటర్లు తెరుచుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుద‌ల చేయ‌నుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టనుంద‌నేది ఆస‌క్తిగా మారింది. (రాజ్‌నాథ్‌తో భేటీకి చైనా తీవ్ర ప్రయత్నం)

కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో సినిమా రంగం కూడా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కారణంగా సుమారు ఐదు నెలలకు పైగా సినిమా థియేటర్లు మూతబడ్డాయి. దీని వల్ల విడుదలకు సిద్ధంగా ఉన్న ఎన్నో తెలుగు సినిమాలు వాయిద ప‌డ్డాయి.  చిన్న చిన్న సినిమాలు ఓటీటీ ద్వారా విడుదలైపోతున్నాయి. అయితే, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన స్టార్ హీరోల సినిమాలను ఓటీటీ విడుదల చేసే ధైర్యం చేయలేకపోతున్నారు దర్శక నిర్మాతలు. థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే అనుమతుల కోసం వేచి చూస్తున్నారు.
 

మరిన్ని వార్తలు