ఓబీసీ వర్గీకరణ కమిషన్ గడువు పొడిగింపు

29 Mar, 2023 17:43 IST|Sakshi

న్యూఢిల్లీ:  వెనుకబడిన కులాల (ఓబీసీలు) వర్గీకరణ కోసం నియమించిన రోహిణి కమిషన్ కాలపరిమితిని ఈ ఏడాది జూలై 31 వరకు పొడిగించినట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ వెల్లడించారు. ఓబీసీ వర్గీకరణ కోసం నియమించిన రోహిణి కమిషన్ కాలపరిమితిని పొడిగించారా? కమిషన్ కోరకుండానే గడువు పొడిగించడానికి కారణాలేమిటి? ఇప్పటివరకు ఎన్ని పర్యాయాలు కమిషన్ కాలపరిమితిని పొడిగించారు? రోహిణి కమిషన్ పనిని ఎప్పటికి పూర్తి చేసి నివేదిక సమర్పిస్తుందని రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. 

కోవిడ్ మహమ్మారి ప్రభావంతో దేశవ్యాప్త ఆంక్షల కారణంగా కమిషన్ నిర్ణీత గడువులోగా పని పూర్తి చేయలేకపోవడంతో ప్రభుత్వం కాలపరిమితిని పొడిగించిందని మంత్రి తెలిపారు. కమిషన్ పదవీకాలం ఇప్పటి వరకు 14సార్లు పొడిగించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం కేంద్రం వద్దనున్న ఓబీసీ  జాబితాలో వర్గీకరణకు సంబంధించి నెలకొన్న సందిగ్ధతను నివృత్తి చేసుకుని జాబితాను పూర్తిస్థాయిలో ఖరారు చేసేందుకు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి పనిచేస్తోంది. ఈ పని పూర్తికావడానికి సమయం పడుతుందని మంత్రి తెలిపారు. నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడే రోహిణి కమిషన్ పనిచేస్తోందని, కమిషన్ పదవీ కాలపరిమితి ఈ ఏడాది జూలై 31 వరకు ఉందని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు