కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌‌ కన్నుమూత

8 Oct, 2020 20:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధినేత రాం విలాస్‌ పాశ్వాన్ (74)‌ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం పాలైన ఆయనకు ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌  తన తండ్రి చనిపోయినట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. పాశ్వాన్‌ హఠాణ్మరణంపై పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మృతిచెందడం ఎల్‌జేపీకి తీరని లోటుగా నేతలు భావిస్తున్నారు.  ఆయన మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

పాశ్వాన్‌ ప్రస్తుత వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిగా ఉన్నారు. 2010 నుండి 2014 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్న తరువాత 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో హాజీపూర్ నియోజకవర్గం నుండి 16వ లోక్‌సభ తిరిగి ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగున్నారు. మొత్తం ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1946 జూలై 5న బిహార్‌లో జన్మించిన పాశ్వాన్‌..  2000లో లోక్‌ జనశక్తి పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగంగా కేంద్రమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. కాగా రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు తమ సంతాం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మరణంతో దేశం దూరదృష్టి గల నాయకుడిని కోల్పోయింది. పార్లమెంటులో అత్యంత చురుకైన మరియు ఎక్కువ కాలం పనిచేసిన సభ్యులలో ఆయన ఒకరు. అతను అణగారిన వర్గాలవారికి స్వరం, అట్టడుగున ఉన్నవారికి విజయాన్ని అందించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నా
- రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

రామ్‌విలాస్‌ పాశ్వాన్ ఇక లేరన్న వార్త నన్ను దిగ్ర్బాంతికి గురిచేసింది. పాశ్వాన్‌ మృతితో ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను. పేదల కోసం అహర్నిశలు శ్రమించారు. ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగానూ లోటుగా అనిపిస్తుంది. తాను ఓ మంచి స్నేహితుడిని, సహచరుడిని పేదల కోసం ఆలోచించే వ్యక్తిని కోల్పోయాను.
- ప్రధాని నరేంద్ర మోదీ

రామ్ విలాస్ పాశ్వాన్ జీ అకాల మరణం బాధాకరం. పేదలు, అణగారిన వర్గాలు ఆయన మృతితో ఈ రోజు ఒక బలమైన రాజకీయ గొంతును కోల్పోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. పాశ్వాన్‌ కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం ప్రకటిస్తున్నాను.
- రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేత

మరిన్ని వార్తలు