అధికారులపై కేంద్రమంత్రి దాడి.. తలుపులు మూసి కుర్చీ తీసుకొని..

22 Jan, 2022 09:56 IST|Sakshi

భువనేశ్వర్‌: కేంద్రమంత్రి విశ్వేశ్వర టుడు ప్రభుత్వ అధికారులపై దాడి చేసి, వారిని గాయపరిచారు. మయూర్‌భంజ్‌ జిల్లాలో ఈ సంచలనాత్మక సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గాయపడిన వారిలో మయూర్‌భంజ్‌ జిల్లా ప్రణాళిక, పర్యవేక్షణ కేంద్రం డిప్యూటీ డైరెక్టరు అశ్వినికుమార్‌ మల్లిక్, సహాయ డైరెక్టరు దేవాశిష్‌ మహాపాత్రో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతున్నారు.

వివరాలిలా ఉన్నాయి.. లక్ష్మీపోషీ దగ్గరున్న పార్టీ కార్యాలయానికి సదరు అధికారులను రప్పించుకుని, మంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి, అధికారుల మధ్య జరిగిన చర్చ వేడెక్కడంతో మంత్రి తన అనుచరులతో కార్యాలయం తలుపులు మూయించి, అధికారులను దుర్భాషలాడి అక్కడి కుర్చీతో వారిపై దాడికి పాల్పడినట్లు ప్రధాన ఆరోపణ. ఈ దాడిలో అశ్వినికుమార్‌ మల్లిక్‌ ఎడమ చేయి విరిగింది. ఈ విషయం జిల్లా కలెక్టరు దృష్టికి వెళ్లగా లిఖితపూర్వకమైన ఫిర్యాదు దాఖలు చేస్తే తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అయితే తనపై వచ్చిన ఈ ఆరోపణ అవాస్తవమని మంత్రి విశ్వేశ్వర టుడు ఖండించారు.

మరిన్ని వార్తలు