కరోనా థర్డ్‌ వేవ్‌, సెంట్రల్‌ యాక్షన్‌ ప్లాన్‌

23 May, 2021 14:48 IST|Sakshi

సాక్క్షి, న్యూఢిల్లీ: సెకండ్‌ వేవ్‌ నేర్పిన గుణపాఠంతో థర్డ్‌వేవ్‌కి ముందుగానే సన్నద్ధం అవుతోంది కేంద్రం. దేశవ్యాప్తంగా వైద్యరంగాన్ని బలోపేతం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు నియమించిన నిపుణుల కమిటీ సలహా మేరకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది.

ఆక్సిజన్‌ కొరత లేకుండా
కరోనా సెకండ్‌వేవ్‌ దేశాన్ని ముంచెత్తగానే ఎదురైన మొదటి సమస్య ఆక్సిజన్‌ కొరత. దీంతో ఈ సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టింది కేంద్రం. దేశంలో ఉన్న ప్రతీ జిల్లాలో రెండు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా గాలి నుంచి ఆక్సిజన్‌ తయారు చేసే ప్రెషర్‌ అడ్‌ర్సాప్షన్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లు (PSA) నిర్మించనుంది. అది కూడా జులై 30వ తేదిలోగా  నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జులై చివరి నాటికి మొత్తంగా 1,051 PSA ప్లాంట్ల నిర్మాణం పూర్తయిదే 2,000 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కొత్తగా అందుబాటులోకి వస్తుంది. ఇక 50 నుంచి 100 బెడ్ల సామర్థ్యం ఉండే మధ్య, చిన్న తరహా ఆస్పత్రుల కోసం 450 లీటర్ల ట్యాంకర్లను కొనుగోలు చేయనున్నారు. వీటితో పాటు ఏకంగా కొత్తగా లక్ష ఆక్సిజన్‌ సిలిండర్లు తయారీకి ఆర్డర్‌ ఇచ్చింది కేంద్రం. 

ట్యాంకర్లపై దృష్టి
ప్రస్తుతం ఆక్సిజన్‌ రవాణాకు ఎక్కువ సమయం పడుతోంది.  తక్కువ సమయంలో ఆస్పత్రులకు తరించడం కష్టంగా మారడంతో ఆక్సిజన్‌ తరలించేందుకు ప్రత్యేకంగా రైళ్లు, విమానాలు నడిపించాల్సి వచ్చింది. ఆక్సిజన్‌ సరఫరాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,270 ఆక్సిజన్‌ ట్యాంకర్లు ఉన్నాయి. వీటికి తోడు మరో వందట్యాంకర్లు తయారు చేస్తున్నారు. వీటికి అదనంగా 248 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా ఆక్సిజన్‌ రవాణను గ్రీన్‌ ఛానల్‌ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. 

స్టాక్‌ ఫుల్‌ 
కరోనా చికిత్సలో ఉపయోగించే అత్యవసర, సాధారణ ఔషధాలు రెండు మూడు నెలలకు సరిపడ నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు తయారీదారులతో కేంద్రం సంప్రదింపులు చేస్తోంది. ఔషధాల కొరత రాకుండా చూడాలంటూ ఫార్మా కంపెనీలను ఆదేశించింది. కరోనా సెంకడ్‌ వేవ్‌ ఇప్పుడిప్పుడే నెమ్మదిస్తోంది. మరోవైపు దేశంలో అక్కడక్కడ కరోనా థర్డ్‌ వేవ్‌ మొదలైందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక అక్టోబరు నుంచి డిసెంబర్‌ మధ్యన ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ వచ్చేందుకు అవకాశం ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో కేంద్రం ముందుగానే సన్నద్ధం అవుతోంది. 

మరిన్ని వార్తలు