లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రానికి ఎంత లాభమంటే..

15 Mar, 2021 20:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఎక్సైజ్‌ సుంకం, సర్‌ చార్జీల రూపంలో భారీగా వసూలు చేస్తోన్న కేంద్రం

న్యూఢిల్లీ: రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలేం ఖర్మ ఏకంగా గ్రహాలన్నింటిని చూపిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర సెంచరీ దాటింది. తాజాగా సోమవారం 16వ సారి ఇంధన ధరలు పెరిగాయి. కేంద్రానికి అధిక ఆదాయం తెచ్చే వనరుల్లో ఇంధనానిది ప్రముఖ స్థానం. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రం పార‍్లమెంట్‌ వేదికగా వెల్లడించింది. ఇంధనం మీద వసూలు చేసే ఎక్సైజ్‌, సెస్‌, సర్‌చార్జీల ద్వారా కేంద్రానికి భారీ మొత్తంలో ఆదాయం వస్తున్నట్లు తెలిపింది.

 మే 6, 2020 నుంచి ఇప్పటి వరకు కేంద్రం లీటర్‌ పెట్రోల్‌ మీద 33 రూపాయలు, లీడర్‌ డీజిల్‌ మీద 32 రూపాయలు లాభపడినట్లు వెల్లడించింది. ఈ మొత్తాన్ని ఎక్సైజ్‌ సుంకం, సర్‌ చార్జీల రూపంలో వసూలు చేస్తున్నట్లు తెలిపింది. జనవరి 1, 2020 వరకు కేంద్రం లీటర్‌ పెట్రోల్‌పై 19.98 రూపాయలు, డీజిల్‌పై 15.83 రూపాయలు ఆర్జించగా.. మార్చి 14 నుంచి మే 5 వరకు ఈ మొత్తం రూ.22.98, 21.19కు పెరగగా.. మే 6 నుంచి డిసెంబర్‌ 31, 2020 వరకు లీటర్‌ పెట్రోల్‌ మీద ఏకంగా 32.98, లీటర్‌ డీజిల్‌(బ్రాండెడ్‌) మీద 34.19 రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నట్లు తెలిపింది. 

పెరుగుతున్న ఇంధన రేట్లకు సంబంధించి గత కొద్ది రోజులుగా కేంద్రం విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విపక్షాలు దేశంలో ఇంధన ధరలు.. అంతర్జాతీయ ఉత్పత్తుల ధరల మాదిరిగా ఉన్నాయని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ ఫైనాన్స్ అనురాగ్ ఠాకూర్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. "సాధారణంగా, దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇతర దేశాల కంటే ఎక్కువ, తక్కువగా ఉంటాయి. ఇందుకు వివిధ కారణాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పన్ను పాలన, సంబంధిత సబ్సిడీ పరిహారాలు వంటివి ఇంధన ధరలను ప్రభావితం చేస్తాయి. వీటి వివరాలను ప్రభుత్వం నిర్వహించదు” అని తెలిపారు.

ఇంధన ధరలను నియంత్రించాలంటే.. దీనిని కూడా జీఎస్‌టీ పరిధిలో చేర్చాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంధనం అత్యధిక ఆదాయం తెచ్చే వనరుగా ఉంది. కనుక దాన్ని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకు రావంటున్నారు. ఇంధాన్ని జీఎస్‌టీ పరిధిలోకి చేర్చే అంశంపై అనురాగ్‌ ఠాకూర్‌ స్పందిస్తూ.. “రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 “వస్తువులు,సేవల పన్ను”ను వివరిస్తుంది. అంటే వస్తువులు, సేవల సరఫరాపై పన్ను లేదా రెండింటి సరఫరాపై పన్ను విధించాలి. ఇక పెట్రోలియం వంటి ఉత్పత్తుల సరఫరా జీఎస్టీ పరిధిలోకి రాదు’’ అన్నారు. ఒకవేళ జీఎస్‌టీ కౌన్సిల్‌ దీని గురించి ప్రతిపాదనలు చేస్తే.. అప్పుడు కేంద్రం ఇంధానాన్ని జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తుంది అన్నారు. 

చదవండి:
అధిక పెట్రో ధరలు భారమే

అలా అయితే రూ.75కే‌ లీటర్ పెట్రోల్‌!

మరిన్ని వార్తలు