రుణాలపై చక్రవడ్డీ మాఫీకి ఓకే

4 Oct, 2020 02:56 IST|Sakshi

మారటోరియం కాలానికి వర్తింపు

సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌

న్యూఢిల్లీ: వ్యక్తిగత రుణగ్రహీతలు, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు భారీ ఊరట లభించింది. కోవిడ్‌ నేపథ్యంలో ప్రకటించిన వాయిదాల చెల్లింపుపై మారటోరియంలో ఆయా రుణాల వడ్డీపై వడ్డీ(చక్రవడ్డీ)ని మాఫీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. రూ.2 కోట్ల వరకు రుణాలపై మారటోరియం విధించిన ఆరు నెలల కాలానికి ఈ రద్దు వర్తింపజేయనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ మేరకు ఆర్థిక శాఖ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

కోవిడ్‌ నేపథ్యంలో మార్చి 1 మొదలు ఆగస్టు 31వరకు చెల్లించాల్సిన రుణ వాయిదాలపై మారటోరియం విధిస్తూ రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మార్చిలో సర్క్యులర్‌ జారీచేయడం తెల్సిందే. అయితే, వడ్డీపై వడ్డీ విధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. మారటోరియం కాలంలో రుణాల వడ్డీపై వడ్డీని వసూలు చేయడానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని సెప్టెంబర్‌ 28న కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

తన అఫిడవిట్‌లో ఆర్థిక శాఖ.. రూ.2 కోట్ల లోపు రుణ గ్రహీతలు మారటోరియంను ఉపయోగించుకున్న వారికి మాఫీ వర్తింప జేస్తామని తెలిపింది. మారటోరియం వాడుకోనివారికీ సంబంధిత ప్రయోజనాలను వర్తింపజేస్తామని తెలిపింది. సూక్ష్మ, చిన్న, మధ్య పారిశ్రామిక సంస్థ(ఎంఎస్‌ఎంఈ)లు, విద్యా, గృహ, వినియోగ వస్తువులు, క్రెడిట్‌ కార్డు బకాయిలు, ఆటో, వ్యక్తిగత, వినియోగ తదితర 8 కేటగిరీల కింద ఈ రుణాలను గుర్తించినట్లు పేర్కొంది. ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని చిన్న రుణగ్రహీతలకు చేయూత అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొంది.

అయితే, రూ.2 కోట్లకు మించిన వ్యక్తిగత, సంస్థాగత రుణాలకు మాఫీ వెసులుబాటు వర్తించదని స్పష్టం చేసింది. రుణ మాఫీకి, మారటోరియంకు తేడా తెలిసిన చాలా మంది రుణ గ్రహీతలు మారటోరియంను వినియోగించు కోలేదనీ, ఇలా ఎప్పటి మాదిరిగానే రుణ వాయిదాలు చెల్లించిన వారి సంఖ్య 50 శాతంపైనే ఉంటుందని తెలిపింది. చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు సంబంధించి రూ.3.7 లక్షల కోట్లు, గృహ, తదితర రుణాలకు సంబంధించిన రూ.70 వేల కోట్ల చక్రవడ్డీ భారం భరిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన గ్రాంట్ల కోసం పార్లమెంట్‌ అనుమతి పొందనున్నట్లు వెల్లడించింది. అన్ని కేటగిరీలు, తరగతుల రుణాలపై మారటోరియం కాలానికి చక్రవడ్డీ మాఫీ చేస్తే రూ.6 లక్షల కోట్లకు పైగానే భారం పడుతుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు