ఆ గ్రూప్‌ వారికి ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌

25 May, 2021 04:49 IST|Sakshi
టీకాలు అందుబాటులో లేవంటూ ఢిల్లీలోని ఓ వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద అంటించిన నోటీసు

18–44 ఏళ్ల వయసు వారికి ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్‌పై కేంద్రం నిర్ణయం

వ్యాక్సిన్‌ వృథాను నివారించేందుకేనన్న కేంద్రప్రభుత్వం

స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలదే తుది నిర్ణయమని స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ఇకపై 18–44 ఏళ్ల వయసు వారు ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌ తీసుకోవచ్చు. ఎలాంటి ముందస్తు నమోదులేకుండానే ప్రభుత్వ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రా(సీవీసీ)లకు వచ్చి అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసుకుని టీకా తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. కోవిన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా జరిగే ఈ ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రస్తుతం కేవలం ప్రభుత్వ సీవీసీల్లోనే అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

వ్యాక్సిన్‌ డోస్‌ల వృథాను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.  18–44 ఏళ్ల వయసు వారికి ఆన్‌సైట్‌ సదుపాయం కల్పించడం, వారికి అపాయింట్‌మెంట్‌తోపాటు స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తుది నిర్ణయం తీసుకోవాలని, వారిదే బాధ్యత అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే, ఈ గ్రూప్‌ వారికి సరిపడ డోస్‌లు లేకపోవడంతో పలు రాష్ట్రాల్లో చాలా వ్యాక్సినేషన్‌ కేంద్రాలు మూతపడ్డాయి. డోస్‌లు లేకున్నా ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌కు అవకాశమిస్తే ఈ గ్రూప్‌ వారు వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద పోటెత్తే ప్రమాదముంది. రాష్ట్రాలకు భారీగా డోస్‌లు పంపకుండానే, ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వ్యాక్సినేషన్‌ సెంటర్ల వద్ద ఈ గ్రూప్‌ వారి వల్ల పెరిగే భారీ రద్దీని అరికట్టేందుకే గతంలో కేంద్రప్రభుత్వం ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ను మాత్రమే అమలుచేసిన సంగతి తెల్సిందే. ప్రైవేట్‌ ఆధ్వర్యంలో నిడిచే సీవీసీల్లో గతంలో మాదిరి∙ముందస్తుగా ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్స్‌కు అనుగుణంగా వ్యాక్సినేషన్‌ షెడ్యూల్‌ను అమలుచేయాలి. వేరే గ్రూప్‌ వాళ్లు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకుని డోస్‌లు తీసుకోవాల్సిన రోజున కొందరు రాకపోవడంతో డోస్‌లు వృథా అవుతున్నాయి. డోస్‌ల వృథాకు సంబంధించిన నివేదికలను కేంద్రం పరిశీలించింది. వృథాను అరికట్టేందుకే పరిమిత సంఖ్యలో 18–44 వయసు వారికీ ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌ నిబంధన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్రానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. 

మరిన్ని వార్తలు