ఏకే–203 రైఫిళ్ల తయారీ అమేథీలో

5 Dec, 2021 04:54 IST|Sakshi

న్యూఢిల్లీ: అత్యాధునిక ఏకే–203 రకం రైఫిళ్లను భారత్‌లో తయారుచేసేందుకు మార్గం సుగమం అయింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ పరిధిలోని కోర్వాలో రైఫిళ్లను తయారుచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో ఆత్మనిర్భర్‌ సాధించడానికి తాజా నిర్ణయం బాటలుపరుస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రూ.5వేలకోట్ల ప్రాజెక్ట్‌లో భాగంగా ఐదు లక్షలకుపైగా రైఫిళ్లను అక్కడ ఫ్యాక్టరీలో తయారుచేస్తారు. ‘ ఈ కొత్త ప్రాజెక్టు కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవకాశాలు మెరుగుపడతాయి’ అని సంబంధిత వర్గాలు చెప్పాయి.

మూడు దశాబ్దాల క్రితం నుంచి భారత సాయుధ బలగాల కోసం వినియోగిస్తున్న ఇన్సాస్‌ రైఫిళ్ల స్థానంలో ఈ అధునాతన ఏకే–203 రైఫిళ్లను తెచ్చారు. ఈ తేలికైన 7.62 ్ఠ 39 మిల్లీమీటర్ల కాలిబర్‌ రైఫిల్‌ 300 మీటర్ల దూరంలోని లక్ష్యాలనూ చేధించగలదు. ఈ నెల ఆరున రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశముంది. చాలా సంవత్సరాల క్రితమే ఈ ఒప్పందంపై రెండు దేశాలూ ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే, రైఫిళ్ల సాంకేతికత రష్యా నుంచి భారత్‌కు బదిలీచేసే అంశం కొలిక్కి రాలేదు. ఇంతకాలానికి ఇది సాధ్యమైంది.

పుతిన్‌ పర్యటనలో పలు ఒప్పందాలు..
సోమవారం ఢిల్లీకి రానున్న పుతిన్‌ సమక్షంలో భారత్‌ రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంథనం, సాంకేతిక రంగాలకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. సోమవారం సాయంత్రం 5.30గంటలకు కీలక వ్యూహాత్మక అంశాలపై మోదీ, పుతిన్‌ చర్చించనున్నారు. ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల 2+2 భేటీల్లో తూర్పు లద్దాఖ్‌ సరిహద్దు ఉద్రిక్తత, తాలిబాన్‌ పాలనలో అఫ్గాన్‌ నుంచి భారత్‌కు పెరగనున్న ఉగ్ర ముప్పు అంశాలూ చర్చించనున్నారు. రెండు ఇంజన్ల కమోవ్‌–226టీ తేలికపాటి 200 హెలికాప్టర్ల సంయుక్త తయారీ అంశం ఓ కొలిక్కిరానుంది. వచ్చే మూడేళ్లలో ఇరుదేశాల పెట్టుబడుల ఒప్పందాలు 50బిలియన్‌ డాలర్ల స్థాయికి చేర్చడంపైనా దృష్టిపెట్టనున్నారు.

మరిన్ని వార్తలు